పేదలపై కేసులు.. పెద్దల వద్ద మామూళ్లా?
వేమనపల్లి : అక్రమంగా నల్లబెల్లం, పటిక, అమ్మోనియా, అధిక ధరలకు మద్యం అమ్మతున్నా పట్టించుకోవడం లేదని ఎస్సీ కాలనీవాసులు ఎక్సైజ్ అధికారులను నిలదీశారు. పేదలు గుడుంబా కాస్తే కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. మండలంలోని ఎస్సీ కాలనీలో ఎక్సైజ్ ఎస్సై కిశోర్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించి కుమ్మరిమల్లక్క ఇంట్లో చొరబడి హైరానా చేశారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడవేసి బెల్లం నాన పోసి ఉంచిన కుండలను ధ్వంసం చేశారు.
దీంతో కాలనీవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుడంబా కాస్తే కేసులు పెట్టే మీరు గ్రామంలో విచ్ఛలవిడిగా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నా పట్టించుకోరెందుకని నిలదీశారు. పాఠశాలల ముందు అక్రమంగా బెల్ట్‌షాపులు, సిట్టింగ్‌లు పెట్టి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాగ్వాదానికి దిగారు. మహారాష్ట్రకు రోజుకు లక్షల విలువ చేసే మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నా.. మామాళ్లు తీసుకుని వదిలివేస్తున్నారని ఆరోపించారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.