హైదరాబాద్ : ఆధునిక సమాజంలో చాలామంది తమ భావాలను నేరుగా వ్యక్తీకరించడం మరచి... టైప్ చేయడం, బొమ్మలతో వ్యక్తం చేయడం చేస్తున్నారని, ఇది సరికాదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మహాత్రియ రా పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్క్ హోటల్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో), హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్స్’పేరుతో ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ సభ్యులతో పాటు, వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్రియా రా మాట్లాడుతూ... భావ వ్యక్తీకరణ నేరుగా హావభావాలతో ఆచరణలో చూపించాలన్నారు. అప్పుడే అనుబంధాలు నాలుగు కాలాల పాటు ఉంటాయని తెలిపారు. కుటుంబం కోసం సమయం వెచ్చించాలని, కుటుంబసభ్యుల మధ్య నిందలు కాకుండా పొగడ్తలు మాత్రమే ఉండాలని చెప్పారు. దైవం మన ఇంట్లోనే ఉన్నారని, ఇంట్లో వారిని సంతోషానికి గురి చేయాలని చెప్పారు.
వృత్తిలో కస్టమర్ మెప్పు కోసం ఏమైనా చేస్తామని.. అదే ఇంట్లోవారి కోసం కూడా చేయాలన్నారు. కుటుంబ వ్యవస్థలోని బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. కుటుంబ వ్యవస్థ పటిష్టతకు సంబంధ బాంధవ్యాలే పునాది అన్నారు. పిల్లలను స్పర్శ ద్వారా ప్రేమపూర్వకంగా దగ్గరికి తీసుకోవాలని తెలిపారు. ఇవి పాటిస్తే రాబోయే రోజుల్లో పుస్తకాలు చదివి సంబంధ బాంధవ్యాలు పెంచుకొనే దౌర్భాగ్య పరిస్థితి పట్టకుండా ఉంటుందన్నారు. ఎంతటి టెక్నాలజీ అభివృద్ధి చెందిన చేతిరాత మరవొద్దని, అది బ్రెయిన్ రైటింగ్ అని తెలిపారు. రాతను బట్టి అతని మనస్తత్వం చెప్పవచ్చని తెలిపారు. ఎఫ్‌ఐసీసీఐ హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్ ప్రియాంక గనెరివాల్ అరోరా మాట్లాడుతూ... ఆరు లక్షల రూపాయలు వెచ్చించి 1,000 మంది విద్యార్థినులకు హ్యాపీ ఉమెన్స్ కిట్స్‌ను త్వరలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌వో జాతీయ అధ్యక్షురాలు పింకీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment