ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు 795 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మంగళవారం నామినేషన్ల పరిశీలన నిర్వహించగా, భువనగిరి నియోజకవర్గం మినహా మిగిలిన 16 స్థానాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం ప్రకటించింది. 16 లోక్‌సభ స్థానాల్లో 612 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 130 మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగిలిన 482 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారు. భువనగిరి స్థానంలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించగా, సదరు అభ్యర్థులు పునఃపరిశీలన కోసం అప్పీల్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకుడు ఈ ముగ్గురు అభ్యర్థుల అప్పీళ్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని మంగళవారం రాత్రి సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, మే 23న ఫలితాలు వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment