వంశీకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్‌లో (గేట్) వరంగల్ ఎన్‌ఐటీ విద్యార్థి సౌరవ్ కుమార్ సింగ్.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీలతోపాటు ఇతర విద్యా సంస్థల్లో ఎంఈ/ఎంటెక్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గేట్ ఫలితాలను ఐఐటీ గౌహతి శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జాతీయ స్థాయి ప్రథమ ర్యాంకు సహా 100 లోపు ఏడు ర్యాంకులను వరంగల్ ఎన్‌ఐటీ విద్యార్థులే కైవసం చేసుకున్నట్లు ఎన్‌ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు వెల్లడించారు. గత నెల 3, 4, 10, 11 తేదీల్లో 23 సబ్జెక్టుల్లో గేట్‌ను ఐఐటీ గౌహతి నిర్వహించింది. ఇందులో ఎన్‌ఐటీ విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ర్యాంకులను సాధించినట్లు తెలిసింది. ఒక్కసారి సాధించిన గేట్ స్కోర్‌కు మూడేళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ మూడేళ్లలోగా ఎప్పుడైనా ఎంటెక్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి గేట్ ర్యాంకు ఉపయోగపడుతుంది.
ఉద్యోగాలకూ ‘గేట్’దాటాల్సిందే!
గేట్ స్కోర్ ఉన్న వారికి ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల పెరిగింది. ఎన్‌టీపీసీ, గెయిల్, ఐవోసీఎల్, హెచ్‌ఏఎల్, బీహెచ్‌ఈఎల్ తదితర సంస్థలు గేట్‌లో అర్హత సాధించిన వారికే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి గేట్‌కు దాదాపు 15 వేల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment