కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఐదు మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యం
కాళేశ్వరం/మంథని: కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాలవల్ల ప్రాణహిత నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. కన్నెపల్లి పంపుహౌస్‌లో ఐదు మోటార్లు ఏకధాటిగా నడుస్తుండటంతో గ్రావిటీ కాల్వ ద్వారా వెళుతున్న నీరు అన్నారం బ్యారేజీకి చేరి జలకళ ఉట్టి పడుతోంది. మంగళవారం కన్నెపల్లి పంపుహౌస్‌లో 2వ నంబర్ మోటార్‌కు వెట్‌రన్ పూర్తి చేసి ఎత్తిపోతలు చేస్తున్నారు. 1, 2, 3, 4, 6వ మోటార్లు నీటిని డెలివరీ సిస్టంలో ఎత్తిపోస్తున్నాయి. ఒక్కో మోటార్ రోజుకు 2,210 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఐదు మోటార్లు 24 గంటలు నడిస్తే ఒక్క టీఎంసీ నీరు తరలించొచ్చు. కాగా, మేడిగడ్డ బ్యారేజీలో ప్రస్తుతం 6.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీలో మొత్తం 85గేట్లు మూసి ఉంచారు.
రెండో మోటార్ వెట్‌రన్
మూడు రోజుల క్రితమే అన్నారం పంపుహౌస్‌లో మొదటి మోటార్‌కు అధికారులు వెట్‌రన్ నిర్వహించారు. మోటార్‌ను సోమవారం చాలాసేపు నడిపిం చడంతో సుందిళ్ల బ్యారేజీలోకి నీరు చేరుతోంది. మంగళవారం మొదటి మోటార్ నడిపిస్తూనే రెండో మోటార్‌కు వెట్‌రన్ నిర్వహించారు. దీంతో సుందిళ్ల బ్యారేజీలోకి కాళేశ్వరం జలాలు చేరుతున్నాయి.
వారంలో ఎల్లంపల్లికి..
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మరో వారం రోజుల్లో కాళేశ్వ రం జలాలు చేరే అవకాశం ఉంది. కన్నెపల్లిలో ఐదు మోటార్లు ఇప్పటికే ప్రారంభించగా మరో రెండు మోటార్లు నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నారంలోనూ మరో రెండు మోటార్లు నడిపించేలా సన్నాహాలు చేస్తున్నారు. అనుకున్నట్లుగానే మోటార్లు నడిస్తే రెండు మూడు రోజుల్లో సుందిళ్ల బ్యారేజీ పూర్తిగా నిండి ఎల్లంపల్లి దిశగా ఎదురెక్కే అవకాశం ఉంది. 74 గేట్లతో 8.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న సుందిళ్ల బ్యారేజీలో ప్రస్తుతం 0.35 టీఎంసీల నీరు చేరింది. కేవలం ఒక్క మోటారు కొద్ది గంటలు నడిస్తేనే ఇలా ఉంటే.. నిరంతరం నాలుగు మోటార్లు నడిస్తే నాలుగు రోజుల్లో బ్యారేజీ నిండి గోలివాడ పంప్‌హౌస్‌కు నీరు చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఆల్మట్టిలోకి 15వేల క్యూసెక్కులు
ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టికి ప్రవాహాలు తగ్గినా, ఒక టీఎంసీకి తగ్గకుండా ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15,300 క్యూసెక్కు ల మేర ప్రవాహం వస్తోంది. దీంతో ఆల్మట్టిలో ప్రస్తు తం 129 టీఎంసీలకు గానూ 119 టీఎంసీల మేర నిల్వలున్నాయి. మరో 10 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండనుంది. దిగువ నారాయణపూర్ ప్రాజెక్టులోకి పూర్తిగా ప్రవాహాలు తగ్గాయి. ప్రాజెక్టులో 37 టీఎంసీలకు గానూ 34 టీఎంసీల నిల్వలుండగా, 4,500 క్యూసెక్కుల నీటిని కాల్వలకు వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment