పాలమూరు ప్రాజెక్టు భూములు పారదర్శకంగా కొనుగోలు
- రైతులతో గ్రామసభలు నిర్వహించాకే నిర్ణయం
- జిల్లా కలెక్టర్ శ్రీదేవి
మహబూబ్‌నగర్ టౌన్: పాలమూరు ప్రాజెక్ట్‌కు అవసరమైన భూమిని రైతుల నుంచి పారదర్శకంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమయ్యే భూమిని డీపీఆర్ నివేదిక ఆధారంగా కొనుగోలు చేయాలన్నారు. ఆ భూములకు సంబంధించిన రైతులతో పలుమార్లు గ్రామసభలు నిర్వహించి, వారిని చైతన్య పరిచాకే కొనుగోలు చేపట్టాల్సిందిగా అధికారులకు సూచించారు.
దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇందుకుగాను క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ప్రాజెక్ట్ పనుల్ని వేగవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్ట్ పనులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే జిల్లాలోని 11నియోజకవర్గాల ప్రజలకు లబ్ధిచేకూరుతుందన్నారు. అదే విధంగా ఆయకట్టు పరిధిలోని అన్ని గ్రామాలకు తాగునీటి సదుపాయం కలుగుతుందన్నారు.
యుద్ధ ప్రాతిపదికన పునరావాస పనులు
ప్రాజెక్ట్ నిర్మాణంలో భూముల్ని కోల్పోయే వారికి కల్పించే పునరావాస పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. వారికి ఆలస్యం చేయకుండా పరిహారం చెల్లించాలన్నారు. ఈ విషయంలో అధికారులందరూ తగిన జాగ్రత్తలు పాటించి ప్రాజెక్ట్ నిర్మాణపు పనుల్ని ప్రారంభించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసి ఎం.రాంకిషన్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వనజాదేవి, సర్వేల్యాండ్ ఏడీ శ్రీనివాస్, ఆర్డీఓలు దేవేందర్ రెడ్డి, రాంచందర్, పార్థసారధి, మోహన్ గౌడ్‌తోపాటు, తహశీల్దార్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.