అన్నం పెట్టకుండా చిత్రహింసలు పెట్టాడని..
కరీంనగర్: పొలంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతుని గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి చంపిన ఘటన వినూత్న మలుపు తిరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌లో శుక్రవారం ఉదయం జరిగిన హత్య కేసులోని వాస్తవాలు ఇలా ఉన్నాయి.. రెండు రోజులుగా తనను తీవ్రంగా కొట్టడంతో పాటు అన్నం కూడ పెట్టకపోవడంతో తానే ఈ హత్య చేశానని మృతుడి తండ్రి దొనవల్లి లింగయ్య(75) ఒప్పుకున్నాడు. హత్య చేసిన వెంటనే తనకు ఏమి తెలియదని.. తాను నిద్రపోతున్న సమయంలో ఈ దారుణం జరిగిందని ముందు అన్నా.. తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేశాక నిజం అంగీకరించాడు.
గత కొన్ని రోజులుగా భోజనం పెట్టకుండా చిత్రహింసలు పెడుతుండటంతో తట్టుకోలేక ఈ హత్య చేశానని ఆయన పోలీసులకు తెలిపాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ సీఐ రంగయ్యగౌడ్ హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.