సమావేశంలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
ఎదులాపురం(ఆదిలాబాద్) : బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం బీసీ సంఘ భవనంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ప్రారంభ, స్టడీ మెటీరియల్ పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యార్థులకు గ్రూప్–4, వీఆర్‌వో స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. బీసీ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత కార్ డ్రైవింగ్ శిక్షణను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఉద్యోగాల భర్తీ పరంపర మొదలైందన్నారు. ఇప్పటి వరకు 82 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగస్తులుగా మారాలని ఆకాంక్షించారు.
ఒక ఉద్యోగంతో ఒక కుటుంబ ఆర్థిక వ్యవస్థ మారిపోతోందని అన్నారు. వెనుకబడిన అన్ని వర్గాల వారికి సేవ చేయడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో 4 ఎకరాల్లో బీసీ భవనం నిర్మించ తలపెట్టామని, అందులో బీసీలే కాకుండా అన్ని పేదల వర్గాల వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు నమ్మకం, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ తరగతులకు ఎంపిక కానీ అభ్యర్థులు నిరాశ చెందవద్దన్నారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5 లక్షలు వెచ్చించి మరో 200 మందికి శిక్షణ ఇíప్పిస్తామని హామీ ఇచ్చారు.
మున్సిపల్ చైర్మన్ పర్సన్ రంగినేని మనీషా, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పార్థ సారిథి, సభ్యులు వెండి బద్రేశ్వర్‌రావు, ప్రమోద్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు బండారు సతీశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment