‘విదేశీయుల’పై నజర్‌! | FRRO And IB Officials Focus on Foreigners in Hyderabad | Sakshi
Sakshi News home page

‘విదేశీయుల’పై నజర్‌!

Published Wed, Jul 17 2019 1:30 PM | Last Updated on Wed, Jul 17 2019 1:30 PM

FRRO And IB Officials Focus on Foreigners in Hyderabad - Sakshi

వివరాలు సేకరిస్తున్న అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై పోలీసు విభాగం దృష్టి పెట్టింది. ఎలాంటి పత్రాలు లేకుండా, గడువు ముగిసినా ఇక్కడే తిష్టవేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. సిటీ పోలీసు, ఫారెనర్స్‌ రిజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ), కేంద్ర నిఘా వర్గాలతో ఏర్పడిన ఉమ్మడి బృందాలు మంగళవారం వరుస దాడులు చేశాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎనిమిది ఠాణాల పరిధిలో 75 మందిని తనిఖీ చేశారు. వీరిలో 23 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి విషయంలో ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ తదుపరి చర్యలు తీసుకుంటుందని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. కాగా ఓయూ పరిధిలో నివసిస్తున్న ఓ నల్లజాతీయుడు అక్రమంగా ఆధార్‌ కార్డు సైతం పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడిపై సంబంధిత చట్టం కింద మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. 

పాస్‌పోర్ట్‌ అక్కడే ‘డిపాజిట్‌’ చేసి...
హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల్లో ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. కొందరు ఇక్కడికి వచ్చిన తర్వాత నిబంధనలు తెలియక, తప్పనిసరి పరిస్థితుల్లో వీసా గడువు ముగిసినా ఉండిపోతున్నారు. ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘స్థిరపడాలనే’ ఉద్దేశంతో పథకం ప్రకారం వివిధ రకాలైన వీసాలపై ఇక్కడికి వస్తున్న వారూ ఉంటున్నారు. దేశంలోని ఇతర మెట్రోల్లో దిగుతున్న వీరు అక్కడే ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓలో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఆపై ఆయా ప్రాంతాల్లోని పరిచయస్తుల వద్ద తమ పాస్‌పోర్టులను ఉంచి  హైదరాబాద్‌ చేరుకుని అక్రమంగా నివసిస్తున్నారు. ఏదైనా నేరానికి పాల్పడినా పాస్‌పోర్ట్‌ లేని కారణంగా దానిపై రిమార్క్‌ పడదని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. 

ఏకకాలంలో ఆకస్మిక దాడులు  
దీనిపై కొన్నాళ్లుగా నిఘావేసిన ప్రభుత్వ విభాగాలు ఎట్టకేలకు చర్యలు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌ఆర్‌లో అధికారులు ఈ విదేశీయుల డేటాను అప్‌డేట్‌ చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సాయంతో వారి వద్దకు వెళ్లి  వేలిముద్రలు, ఫోటోలు తదితరాలు రిజిస్టర్‌ చేసుకున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించేందుకు దాడులు చేయాలని సోమవారం నిర్ణ యించారు. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, ఐబీ, స్పెషల్‌బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో కూడిన 21 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బంజారాహిల్స్, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, లంగర్‌హౌస్, చిలకలగూడ, మలక్‌పేట, అంబర్‌పేట, సైఫాబాద్, ఉస్మానియా వర్శిటీ, చిక్కడపల్లి ఠాణాల పరిధిలో వరుస దాడులు చేశాయి. మొత్తం 75 మందిని తనిఖీ చేసిన ఈ బృందాలు 23 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించాయి. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. 

డిటెన్షన్‌ సెంటర్స్‌కు తరలించి...
ఈ అక్రమ నివాసితులను డిటెన్షన్‌ సెంటర్స్‌గా పరిగణించే నగర నేర పరిశోధన విభాగంతో (సీసీఎస్‌) పాటు మహిళా పోలీసుస్టేషన్, ఇతర ఠాణాలకు తరలించారు. వీరిపై పాస్‌పోర్ట్, ఫారెనర్స్‌ యాక్టŠస్‌ ప్రకారం రెండు రకాలైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో, అవగాహన లేక ఓవర్‌స్టే చేస్తున్న వారితో జరిమానా కట్టించి ఎగ్జిట్‌ వీసాపై పంపడం, ఉద్దేశపూర్వకంగా ఉండిపోయిన వారిని డిటెన్షన్‌లో ఉంచి ఆయా దేశాలకు డిపోర్టేషన్‌ చేయడం (బలవంతంగా తిప్పిపంపడం) వంటి చర్యలు తీసుకోనున్నారు. వీరికి అవసరమైన పాస్‌పోర్టులు, వీసాల కోసం ఆయా రాయబార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. అక్రమంగా ఉంటున్న వారిలో కొందరిని తీవ్రతను బట్టి నిర్ణీత కాలానికి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని నిర్ణయించారు. ఇలా చేస్తే ఆ గడువు ముగిసేవరకు వారు  మళ్ళీ దేశంలోకి అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఈ తరహా స్పెషల్‌ డ్రైవ్స్‌ను కొనసాగించాలని పోలీసు విభాగం నిర్ణయించింది.

సక్రమంగా వచ్చి అక్రమంగా మారి...
నగరం విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. ఫలితంగా ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు చెందిన వారు సిటీకి వస్తున్నారు. కల్చర్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమంలో భాగంగానూ పలువురు విదేశీయులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్‌ వీసాలపై వచ్చిన వారిలో కొందరు ఇక్కడే అక్రమంగా ఉండిపోతున్నారు. పాస్‌పోర్ట్, విదేశీచట్టాలను తుంగలో తొక్కి తమ ‘పనులు’ చూసుకుంటున్నారు. గతంలో నగరంలో నివసించే విదేశీయులు కచ్చితంగా స్పెషల్‌ బ్రాంచ్‌లో రిజిస్టర్‌ చేసుకునే వారు. అయితే కొన్నేళ్లుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన వారు మినహా మిగిలిన వారంతా ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ వద్ద రిజిస్టర్‌ చేసుకునే నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో సిటీ పోలీసుల వద్ద అక్రమంగా ఉంటున్న వారి డేటా అందుబాటులో ఉండట్లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement