కన్వీనర్ కోటా ఫుల్.. మేనేజ్‌మెంట్ కోటా నిల్! | Full-convener quota management quota Nil ..! | Sakshi
Sakshi News home page

కన్వీనర్ కోటా ఫుల్.. మేనేజ్‌మెంట్ కోటా నిల్!

Published Tue, Jun 30 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

కన్వీనర్ కోటా ఫుల్.. మేనేజ్‌మెంట్ కోటా నిల్!

కన్వీనర్ కోటా ఫుల్.. మేనేజ్‌మెంట్ కోటా నిల్!

ఈ సారి ఇంజనీరింగ్‌లో 87,907 సీట్లు

♦ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైంది 62,777 మందే
♦ 25 వేల సీట్లు మిగిలిపోయే అవకాశం
♦ టాప్ కాలేజీల్లో మాత్రం భర్తీ కానున్న మొత్తం సీట్లు

 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కన్వీనర్ కోటా సీట్లు పూర్తిగా భర్తీ కానుండగా, మేనేజ్‌మెంట్ కోటా సీట్లు మాత్రం ఖాళీగా ఉండబోతున్నాయి. కొద్దిగా పేరున్న, టాప్ కాలేజీలు మినహా మిగితా కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారు తక్కువ సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం. ఈసారి రాష్ట్రంలోని 236 ప్రైవేటు, 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లోని 87,907 సీట్ల భ ర్తీకి ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అయితే అర్హులైన విద్యార్థులు మాత్రం 62,777 మందే ఉన్నారు.

వారంతా కాలేజీల్లో చేరినా మరో 25 వేల సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన వారికి ర్యాంకులు ఇస్తే మరో 5 వేలకు మించి సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి లేదు. మరోవైపు ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే వారు 10 వేల మంది వరకు ఉండే అవకాశం ఉంది. దీంతో సాధారణ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటాలో చేరే వారి సంఖ్య పెద్దగా ఉండే అవకాశం లేదని విద్యావేత్తలు భావిస్తున్నారు.

 కన్వీనర్ కోటాలోనూ చేరే వారు గతేడాది కంటే తక్కువే..
 కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్య గత ఏడాది కంటే ఈసారి తక్కువ ఉండే అవకాశం ఉంది. గత ఏడాది 287 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,10,634 సీట్లు అందుబాటులో ఉండగా 55,925 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. అందులో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరిన వారైతే 52,975 మంది ఉండగా, ప్రభుత్వ కాలేజీల్లో 2,950 మంది చేరారు. ఇక ఈసారి కన్వీనర్ కోటాలో 62,445 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అందులో ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లు 3,032 కాగా ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు 59,413 ఉండనున్నాయి. ఇక విద్యార్థులు 62,777 మంది ఉండగా అందు లో ఎంత మంది కాలేజీల్లో చేరుతారన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి గతేడాది కంటే ఈసారి తక్కువ మందే ఇంజనీరింగ్‌లో చేరుతారని విద్యావేత్తలు భావిస్తున్నారు.మరోవైపు ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌కోటాలో 25,462 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
 
 పరీక్ష రాసిన వారిలో సగం మందే
 రాష్ట్రంలో మే 14వ తేదీన నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,28,162 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,04,373 మంది ఎంసెట్‌లో అర్హత సాధించారు. అయితే ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ కావడం, డీబార్ అవడం వంటి కారణాలతో 90,556 మంది విద్యార్థులే ర్యాంకులను పొందారు. అందులో ప్రవేశాల కోసం నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారు 62,777 మంది మాత్రమే ఉన్నారు. అంటే పరీక్షకు హాజరైన వారిలో చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకొని ఇంజనీరింగ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న వారు సగానికంటే తక్కువ మంది విద్యార్థులే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement