దేవాదుల ప్రాజెక్టు (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రం నుంచి ఎంపికైన 11 పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు మోక్షం దక్కడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టులకు మరో రూ.659 కోట్లు అందాల్సి ఉన్నా ఇంతవరకు విడుదల చేయలేదు.
మెజారిటీ ప్రాజెక్టులను మరో రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నా నేపథ్యంలో కేంద్ర సాయం అందకపోవడం.. ప్రాజెక్టుల పనులకు ప్రతిబంధకంగా మారుతోంది. పీఎంకేఎస్‌వై కింద కొమురం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను కేంద్రం గుర్తించింది. వాటి నిర్మాణానికి రూ.24,827 కోట్లు అవసరం కాగా ఇందులో రూ.17,387 కోట్లను రాష్ట్రం ఇప్పటికే ఖర్చు చేసింది. మరో రూ.7,440 కోట్ల నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో కేంద్రం తన వాటా కింద రూ.659.56 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.
దేవాదులకు రూ.496 కోట్లు..
కేంద్ర నిధుల్లో అత్యధికంగా దేవాదులకు రూ.496 కోట్లు, భీమాకు రూ.107 కోట్లు, ఎస్సారెస్పీ–2కు రూ.37 కోట్లు, గొల్లవాగుకు రూ.10కోట్ల మేర సాయం అందాల్సి ఉంది. వరద కాల్వ మినహా మిగతా ప్రాజెక్టులన్నింటినీ ఈ ఏడాదిలోనే పూర్తి చేయాల్సి ఉంది. దీంతో నిధుల కోసం రాష్ట్రంతో పాటు పీఎంకేఎస్‌వై పరిధిలోని ప్రాజెక్టులకు చెందిన రాష్ట్రాలు కేంద్ర జలవనరుల శాఖపై ఒత్తిడి పెంచాయి.
ఈ ఒత్తిళ్లతో ఈ నెల 6న కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ పీఎంకేఎస్‌వై ప్రాజెక్టుల పురోగతి, నిధుల అవసరాలపై రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్రం నుంచి కమిషనర్ మల్సూర్ హాజరు కానున్నారు. ఈ భేటీలో పెండింగ్ నిధులపై స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment