
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి జి.వివేకానంద రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారంరాత్రి సీఎం కేసీఆర్ కు ఆయన పంపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ టికెట్ ఇస్తానని చెప్పి టీఆర్‌ఎస్ పార్టీలోకి తీసుకున్నారని, కానీ తనకు టికెట్ నిరాకరించారని పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో వెల్లడించారు. అయితే, టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయలేదు. శనివారం తన అనుచరులతో భేటీ అయి వివేక్ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. వివేక్ బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారని సమాచారం. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముంది. కాంగ్రెస్ నేతలు కూడా వివేక్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.