కోరుట్ల: రాజ్యాంగమే మనకు రక్ష అన్న విషయాన్ని తెలుసుకుని మొదటిసారిగా ఓటు హక్కును తీసుకున్నానని టీమాస్ వ్యవస్థాపకుడు, ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ‘ఓట్ల యుద్ధానికి సిద్ధమయ్యే క్రమంలో గోచీ.. గొంగడి.. గజ్జెలు.. జమ్మి చెట్టు మీద పెట్టిన’ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంబేడ్కర్, పూలే భావజాలానికి అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల కలయిక ఈ సమయంలో చాలా ముఖ్యమన్నారు.
ఈ దిశలో టీమాస్ సన్నాహాలు సాగిస్తుందన్నారు. కేవలం 7 శాతం జనాభా లేని వారు 93 శాతం జనాభా ఉన్న వారిని పాలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సామా జిక, ఆర్థిక దోపిడీ జరుగుతున్న రీతిలోనే ఓట్ల దోపిడీ కొనసాగుతుందని గద్దర్ చెప్పా రు. తక్కువ శాతం ఓట్లున్న వారు పాలకులు కావడం సరికాదన్నారు. బహుజనులంతా కలసికట్టుగా ఓట్ల యుద్ధానికి సిద్ధం కావా లని ఆయన పిలుపునిచ్చారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం 2.39 లక్షల మంది ఉన్న అగ్రవర్ణాలవారు రాజకీయంగా ఎదుగుతున్నారని, 30 లక్షల మంది బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నప్పటికీ రాజకీయంగా గుర్తింపులేదన్నారు. బహుజనులంతా కలసి కట్టుగా మా ఓట్లు మాకే అనుకున్నప్పుడు ఈ పరిస్థితికి చరమగీతం పాడవచ్చన్నారు. ఓట్ల యుద్ధానికి బహుజనులు సిద్ధమైతే రాజ్యాధికారం సిద్ధిస్తుందన్నారు. యువత ఓట్ల దోపిడీకి తెరవేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment