తీరనున్న గ్యాస్ కష్టాలు
కరీంనగర్ సిటీ :
జిల్లాకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కమలాపూర్ మండల కేంద్రం సమీపంలో ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్‌ను నిర్మించనుంది. సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో 21 నెలల్లో ప్లాంట్ నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్లాంట్ నుంచే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్‌పీజీ సిలిండర్లను సరఫరా చేయనుంది. ప్లాంట్‌కు అవసరమైన 55 ఎకరాల భూమిని సేకరించి తమకు అప్పగించాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరింది. గత ఏడాది నుంచి జరుగుతున్న సంప్రదింపులు.. ఉత్తర పత్యుత్తరాల నేపథ్యంలో భూ సేకరణకు సంబంధించి కంపెనీ తరఫున రూ.3.9 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌ను మంగళవారం ఎల్‌పీజీ చీఫ్ రీజనల్ మేనేజర్ మధుకర్ బి.ఇంగోలే జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్‌డీవో చంద్రశేఖర్, హెచ్‌పీసీఎల్ సీనియర్‌ఆపరేషన్ ఆఫీసర్ మధు పురుషోత్తం, సేల్ఫ్ ఆఫీసర్ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణలో రెండో యూనిట్
తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని చెర్లపల్లిలో హెచ్‌పీసీఎల్ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ ఉంది. కమలాపూర్‌లో నిర్మించే బాట్లిం గ్ ప్లాంట్ రెండోది. వరంగల్‌కు 30 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరం లో ఉండటంతోపాటు ఉప్పల్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండటంతో కమలాపూర్‌లో ప్లాంట్ నిర్మాణానికి హెచ్‌పీసీఎల్ ముందుకొచ్చినట్టు మధుకర్ బి.ఇంగోలే తెలిపారు. గతేడాది మార్చిలోనే హెచ్‌పీసీఎల్ కంపెనీ కమలాపూర్‌లో ప్లాంట్ నిర్మాణానికి సర్వే చేసింది. అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గంలో ఎల్‌పీజీ ప్లాంట్ నిర్మించాలని పలుమార్లు అప్పటి పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి వీరప్పమొయిలీకి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందే మంత్రిని ఆహ్వానిం చి ఈ ప్లాంట్ శంకుస్థాపనకు ప్రయత్నించారు. సర్వే, భూసేకరణ ఒప్పందం ఆలస్యం కావటం తో వాయిదా పడింది. పొన్నం ఓటమి పాలైనా బాట్లింగ్ ప్లాంట్ కోసం అటు కేంద్రానికి, ఇటు హెచ్‌పీసీఎల్‌తో పాటు సంబంధిత అధికారులకు లేఖల ద్వారా విన్నవిస్తూ వచ్చారు. ప్లాంట్ ప్రక్రియ వేగవంతం చేయాలంటూ ఈనెల 9న కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. స్థానిక ఎమ్మె ల్యే ఈటెల రాజేందర్ పూర్తి సహాయ సహకారా లు అందించారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ నిర్మాణానికి హెచ్‌పీసీఎల్ ముందుకు వచ్చింది.
తీరనున్న గ్యాస్ కష్టాలు..
జిల్లాలో ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఉపాధి సమస్య తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్లాంట్ నిర్మాణం కొంతలో కొంత నిరుద్యోగ సమస్య తీర్చనుంది. దీంతోపాటు ఈ ప్రాంత గ్యాస్ వినియోగదారుల కష్టాలు తీరనున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌లో మాత్రమే ఎల్‌పీజీ ప్లాంట్ ఉండడంతో గ్యాస్ వినియోగదారులకు సేవల్లో అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్‌తో సహా నాలుగు జిల్లాల్లోని వినియోగదారులకు గ్యాస్ బాధలు తప్పనున్నాయి.