సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గోదావరి మహా పుష్కరాలకు భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. మూడోరోజు గురువారం వేలాది మంది భక్తులు గోదావరి ఒడిలో పవిత్ర స్నానాలు చేశారు. కంద కుర్తి మొదలు..పోచంపాడ్, తడపాకల్, గుమ్మిర్యాల, తుంగిని, ఉమ్మెడ సహా జిల్లాలో అన్ని ఘాట్ల వద్ద భక్తుల సందడి కనిపించింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు మహారా ష్ర్ట, కర్ణాటక నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించి పునీతులయ్యారు. పుష్కరఘాట్లలో సౌకర్యాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అధికారులతో సమీక్షించారు. కందకుర్తి, పోచంపాడ్, తుంగిని తదితర ఘాట్లను సందర్శించిన ఆయన మొదటి, రెండోరోజు ఎదురైన సమస్యలను గుర్తించి భక్తులకు తగిన ఏర్పాట్లను చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తడపాకల్‌ను సందర్శించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ కుటుంబసభ్యులతో ఎస్‌ఆర్‌ఎస్‌పీ వద్ద పవిత్ర స్నానమాచరించారు. కాగా, శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నందున పుష్కరఘాట్లకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి బం దోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. వాచ్‌టవర్ల ద్వారా వీవీఐపీ, వీఐపీల సందర్శన, భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు, ఘాట్ ఇన్‌చార్జ్‌లు, ప్రత్యేక విభాగాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.
ప్రధాన పుష్కరఘాట్ కందకుర్తిలో నీటి సమస్య ఏర్పడింది. పుష్కరాల కోసం శ్రీరాంసాగర్ నుంచి పోచంపాడ్, సావెల్ తదితర ఘాట్లకు నీటి విడుదల చేపడుతుండటంతో ప్రాజెక్ట్ నుంచి నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. నిరంతరం మూడు వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదులుతున్నారు. నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సరస్వతీ కాలువ ద్వారా 800 క్యూసెక్కులు వదులుతుండగా, గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్ట్ నీటి మట్టం 2.5 అడుగుల మేరకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీటి మట్టం 1,091 అడగులు కాగా, గురువారం సాయంత్రానికి 1055.30 అడుగుల నీరు ఉంది.
గౌతమికి నీరాజనం
Published Fri, Jul 17 2015 3:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement