
జీహెచ్‌ఎంసీ బాండ్ల జారీని బెల్ కొట్టి ప్రారంభిస్తున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్. చిత్రంలో ఎస్‌కే జోషి, జనార్దన్‌రెడ్డి, రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.200 కోట్లు సమీకరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) గురువారం బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్‌ఈ)లో అధికారికంగా లిస్ట్ అయింది. ఎస్‌ఆర్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృ ద్ధి పథకం)లో భాగంగా మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు వంటి అభివృద్ధి పనుల కోసం రూ.1,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ.. తొలివిడతగా రూ.200 కోట్లు సేకరించింది. ఈ బాండ్లను బీఎస్‌ఈలో లిస్ట్ చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, మేయర్ బొంతు రామ్మోహన్ కలసి గంట (గాంగ్) మోగించడం ద్వారా దీనిని అధికారికంగా ప్రకటించారు.
జీహెచ్‌ఎంసీ సరికొత్త ఒరవడి: సీఎస్
బాండ్ల ద్వారా నిధుల సేకరణతో దేశంలోనే జీహెచ్‌ఎంసీ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని, ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా నిధులు సమీకరణలో మిగతా స్థానిక సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలిచిం దని సీఎస్ ఎస్‌కే జోషి ప్రశంసించారు. ఈ నిధులతో చేపట్టే పనులను సరైన ప్రణాళిక, అమలు చర్యలతో నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలని సూచించారు. బాండ్ల మార్కెట్‌లో ప్రవేశం స్థానిక సంస్థలకు కష్టమైన పని అని.. జీహెచ్‌ఎంసీ దాన్ని విజయవంతంగా సాధించిందని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అభినందించారు. ఈ నిధులతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలన్నారు. పారదర్శకత, స్వయం సమృద్ధి విధానాలతో జీహెచ్‌ఎంసీ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని, బాండ్ల కోసం ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ కాగానే చైనాలోని బీజింగ్ వంటి ప్రాంతాల నుంచి జీహెచ్‌ఎంసీ గురించి ఆరా తీశారని బీఎస్‌ఈ లిమిటెడ్ చీఫ్ (బిజినెస్ ఆపరేషన్స్) నీరజ్ కుల్‌క్షేత్ర తెలిపా రు. అప్పు తీసుకోవడాన్ని చాలామంది తప్పు గా భావిస్తారని, బాండ్ల ద్వారా నిధుల సమీకరణ పరపతితో కూడుకున్న పని అని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు.
మౌలిక వసతుల కోసమే..
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకే బాండ్ల ద్వారా నిధులు సేకరించామని మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ ముందంజలో ఉన్నందున పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. దేశంలోని నాలుగువేల పైచీలుకు స్థానిక సంస్థల్లో జీహెచ్‌ఎంసీ మాత్రమే ఆర్థిక స్థిరత్వంతో ‘ఏఏ స్టేబుల్’ర్యాంకు సాధించిందని తెలిపారు.