జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మేయర్ బొంతు రామ్మోహన్
సాక్షి, సిటీబ్యూరో: ఎంతోకాలంగా ఆపిల్ ఐఫోన్‌తో ట్రింగురంగా అందామనుకున్న స్టాండింగ్ కమిటీ సభ్యులు దిగిపోయే రెండు రోజుల ముందు ఆమోదించేసుకోవడం బాగుండదనుకున్నారో, లేక ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయనుకున్నారో కానీ దానికి సంబంధించిన ‘బాల్’ను కమిషనర్ ‘కోర్టు’లో వేశారు. సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్‌కు స్టాండింగ్ కమిటీ సభ్యులు సూచించారు.జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు రూ.2 కోట్ల వరకు నిధుల మంజూరుకు అధికారం ఉన్న విషయాన్నిప్రస్తావిస్తూ నిర్ణయాధికారాన్నిఆయనకు వదిలేశారు. కరోనాతరుణంలో ప్రజల సమస్యలు కాకుండా దీన్ని ఆమోదించుకుంటే బాగుండదని కాబోలు తమ మీదకు రాకుండా వ్యవహరించారు.
అదో క్రేజ్ ..
స్టాండింగ్ కమిటీ సమావేశానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల పనుల వరకు మంజూరు చేసే అధికారం ఉండటంతో తమ వార్డుల్లో అవసరమైన పనులు చేయించుకునేందుకు స్టాండింగ్ కమిటీ సభ్యులకు అవకాశం ఉంటుంది. తమ పరిధిలో కావాలనుకున్న పెద్ద పనుల్ని చేయించుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. లక్ష రూపాయలకు తక్కువ కాని ఐఫోన్లు, ఐపాడ్ల వంటివి పొందుతుండటం జీహెచ్‌ఎంసీలో ఆనవాయితీగా వస్తోంది. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆ మాత్రం కొనుక్కోలేని వాళ్లేంకారు. కానీ.. అదో క్రేజ్. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఐఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, మరేదైనా కానీ ఆ మోజే వేరు. అందుకే పాపం లాక్‌డౌన్ కారణంగా మూడునెలల పాటు సమావేశాలు జరగకుండా కత్తెర పడ్డా.. లాక్‌డౌన్ సడలింపులతో ఎట్టకేలకు చివరి సమావేశం జరుపుకునేందుకు అవకాశం లభించగా, దాన్నయినా తీపి గుర్తుగా మిగుల్చుకోవాలనుకున్నారు. కానీ.. ఎక్కడో, ఏదో తేడా కొట్టింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు, మరో ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులకు వెరసి మొత్తం 17 ఆపిల్ ఐఫోన్లకు(11 ప్రోమాక్స్ మోడల్) రూ.21,34,900 అంచనా వ్యయంతో అజెండాలో ఉంచినప్పటికీ.. తామే ఆమోదించుకుంటే బాగోదని కాబోలు నిర్ణయాన్ని కమిషనర్‌కు అప్పగించారు. త్వరలోనే గుట్టుచప్పుడు కాకుండా అందుకుంటారో.. లేక వదిలేసినట్లో కాలమే చెబుతుంది.
33 తీర్మానాలు ఇవే..
♦ మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ఒక్క అంశం తప్ప మిగతా 33 తీర్మానాలను ఆమోదించారు.
♦ ఆస్తిపన్ను పాతబకాయిల వడ్డీలో 80 శాతం మాఫీ కోసం.. గత (2019–20) ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వేతర భవనాలకు సంబంధించి ఆస్తిపన్నుల పాతబకాయిలు, వాటిపై వడ్డీలు కలిపి రూ.2,495 కోట్ల 62 లక్షలు జీహెచ్‌ఎంసీకి రావాల్సి ఉండగా, రూ.1,394 కోట్ల 72 లక్షలు మాత్రమే వసూలైంది. వసూళ్లు పెంచుకునేందుకు పాతబకాయిలపై వడ్డీలో 80 శాతం వరకు వన్‌టైం ఆమ్నెస్టి స్కీమ్ కింద(వన్ టైమ్ సెటిల్మెంట్) కింద 80 శాతం మాఫీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదించేందుకు తీర్మానం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్ని, జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ తీర్మానం చేశారు.
♦ 201 బస్‌షెల్టర్ల పునర్నిర్మాణానికి 4 ప్యాకేజీలుగా టెండర్లు..
♦ 221 జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్ట్ పొడిగింపు. కొత్తగా 155 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు.
♦ రోడ్డు విస్తరణకు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద సేకరించిన దేవాలయ ఆస్తులతో షాపులు కోల్పోయిన వారికి వనస్థలిపురంలో కొత్తగా నిర్మించిన మోడల్ మార్కెట్‌లో టెండర్ ప్రక్రియలో షాపుల కేటాయింపు.
♦ జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ 040 211 11 111 సేవలు మరో మూడు సంవత్సరాలకు పొడిగింపు.
ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా చేసేందుకు...
స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ రోడ్ల పక్కన, మీడియంలో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిర్మాణ వ్యర్థాలు, గడ్డి, చెత్తాచెదారం నిండి ఉంటుందని, స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో కొద్దిసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా చేసేందుకు చొరవ తీసుకోవాలని అధికారులకు, కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేశారు. నిల్వ ఉన్న నీటిలోనే కాకుండా రోజూ వినియోగించే నీళ్ల డ్రమ్ములు, కూలర్లలో కూడా దోమల గుడ్లు(లార్వా)లు ఉంటాయని, ఆ నీటిని తొలగించి పొడిగా ఆరబెట్టినప్పుడే లార్వాలు చనిపోతాయని తెలిపారు. దోమల నివారణకు నిర్వహించే ఫాగింగ్, యాంటి లార్వా ఆపరేషన్లను మానిటరింగ్ చేసేందుకు వార్డుల వారీగా ఏ కాలనీలో ఏ రోజు పనులు చేస్తారో షెడ్యూల్‌ను రూపొందించి కాలనీలను మ్యాపింగ్ చేసి ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఫాగింగ్, యాంటి లార్వా స్ప్రేయింగ్ కార్యక్రమాలకు కార్పొరేటర్ల ధ్రువీకరణ పొందాలని స్పష్టం చేశారు.
29న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
♦ ప్రస్తుత స్టాండింగ్ కమిటీ కాలపరిమితి పూర్తికానుండటంతో కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఈ నెల 5న ఎన్నికల నోటిఫికేషన్ వెలువరిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు కార్యాలయ పనిదినాల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మూడో అంతస్తులో ఉన్న ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. దాఖలైన నామినేషన్ల వివరాలను ఈ నెల 19న ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న ఉదయం 11 గంటల నుంచి 12గంటల వరకు నామినేషన్ల స్క్రూట్నీ జరుగుతుందని, అనంతరం సక్రమంగా ఉన్న నామినేషన్లను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామన్నారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అనంతరం కౌంటింగ్ నిర్వహించి ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రకటించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
చెట్లు కూలినా.. నీటి నిల్వలున్నా.. కాల్ చేయొచ్చు..040–29555500
వర్షాకాలంలో ఎక్కడైనా చెట్లు కూలిపోయినా.. నీటి నిల్వలు పేరుకున్నా.. ఇతరత్రా ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం ప్రత్యేక కాల్‌సెంటర్ ఫోన్ నెంబర్ 040 29555500ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 24 గంటల పాటు ఇది పనిచేస్తుందన్నారు.
పాత బకాయిల వడ్డీ మాఫీకి తీర్మానం
♦ మున్సిపల్ మంత్రి బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాతబకాయిల వడ్డీ మాఫీకి సంబంధించి ప్రబుత్వానికి ప్రతిపాదనలు పంపించాలనే ఆదేశాలకు అనుగుణంగానే జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కమిటీ ఈ తీర్మానం చేసింది.
♦ ఆస్తిపన్ను పాతబకాయిలపై వడ్డీ 20 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
♦ జీహెచ్‌ఎంసీ లెక్కల మేరకు 2019–20
ఆర్థిక సంవత్సరం వరకు పాతబకాయిలు పేరుకుపోయిన ప్రభుత్వేతర భవనాలు 5,64,294 ఉన్నాయి.
♦ వీటికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలు రూ.1477.86 కోట్లు కాగా.. వడ్డీ బకాయిలు రూ.1017.76 కోట్లు ఉన్నాయి.
♦ మొత్తం రూ.2,495.62 కోట్లు
♦ ప్రస్తుతం ఈ తీర్మానాన్ని ప్రభుత్వం త్వరలోనే ఆమోదించే అవకాశం ఉంది. తద్వారా పాతబకాయిదారులకు ప్రయోజనం చేకూరుతుది.
Comments
Please login to add a commentAdd a comment