
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఏడాదిలో సరికొత్త రూట్‌లో వెళ్లనుంది. గ్రేటర్‌లో ఇంతకాలం వివిధ పనుల్లో జరుగుతున్న దుబారాను అరికట్టేందుకు వీలుగా పాలసీని రూపొందించింది. ఇప్పటిదాకా తక్షణ మరమ్మతు బృందాల కోసం ఇష్టానుసారం ప్రతిపాదనలు చేసేవారు. చేస్తున్న పనులకు, నియమిస్తున్న బృందాలకు పొంతన ఉండేది కాదు. పనులు లేకున్నా బృందాలను నియమించి నిధులను పక్కదారి పట్టించేవారు. కాగితాల్లో తప్ప వాస్తవంగా కనపడని బృందాలు అనేకం ఉండేవి. వీటి వల్ల ఎంతపని జరుగుతుందో తెలిసేది కాదు. పైగా ఈ పనులపై ఎవరికీ జవాబుదారీతనం లేదు. నిధులు మాత్రం కరిగిపోయేవి. ఈ పరిస్థితులను నివారించేందుకు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు తగిన పాలసీతో ‘వార్షిక క్యాలెండర్’ను రూపొందించారు. సంవత్సరంలో ఏ బృందాలు ఎప్పటి వరకు ఉండాలో, ఏ పనులు ఎప్పడు చేయాలో నిర్ధారిస్తూ అందులో పొందుపరిచారు. రోడ్లు, వరద కాల్వల నిర్వహణ, పూడికతీత వంటి పనులకు తక్షణ మరమ్మతు బృందాలు (ఐఆర్‌టీ), వర్షాకాల అత్యవసర బృందాల(ఎంఈటీ)ను ఏ సీజన్‌లో నియమించాలి.. అవి ఎంతకాలం పనిచేయాలి అనే అంశాలతో పాటు గతేడాది అవి చేసిన పనితనంతో ఈ కొత్త పాలసీ ఉంటుంది. పలు నిబంధనలతో పకడ్బందీగా రూపొందించిన ఈ విధానం ఎంతమేర సఫలీకృతమవుతుందనేది వేచి చూడాలి. కాగా, కొత్త పాలసీలోని విధివిధానాలు ఎలా ఉన్నాయంటే..
తక్షణ మరమ్మతు బృందాలు (ఐఆర్‌టీ)..
త్వరలో ప్రారంభం కానున్న కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి మే 31 వరకు ఈ బృందాలు రంగంలో ఉం డాలి. ఈమేరకు సర్కిళ్లలోని ఇంజినీర్లు సంబంధిత ఉన్నతాధికారి నుంచి పరిపాలన అనుమతి పొందాలి. భవిష్యత్‌లో నవంబర్ నుంచి మే వరకు ఈ బృందాల ను నియమించుకోవాలి. ఈ బృందాల్లో ట్రాలీతో కూడి నడీసీఎం/ట్రాక్టర్, వాహన డ్రైవర్ కాక నలుగురు కార్మి కులతో పాటు తగిన ఉపకరణాలు కూడా ఉండాలి.
♦ రోడ్లపై గుంతల పూడ్చడం, మ్యాన్‌హోల్ కవర్ల మూ తలు, రోడ్డు కట్టింగ్‌ల పూడ్చివేత, సీసీరోడ్ల స్వల్ప మరమ్మతులు, రోడ్ల పక్కనున్న పూడిక తొలగింపు వంటి పనులు చేయడం ఈ బృందాల విధిగా నిర్ణయించారు.
వర్షాకాల అత్యవసర బృందాలు(ఎంఈటీ)
ఈ సీజన్‌లో ఎదురయ్యే వరద సమస్యల పరిష్కారానికి ఈ బృందాలు పనిచేస్తాయి. నీటినిల్వ ప్రాంతాల్లో నీటి తొలగింపు, నీట మునిగిన బస్తీలు, కాలనీల్లో నీటిని తోడివేయడం వంటి పనులు ఎప్పటికప్పుడు చేయాలి. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ బృందాల నియామకాలకు ఏప్రిల్‌లోనే మంజూరు పొంది టెండర్లు పూర్తిచేసి జూన్ నుంచి విధుల్లో ఉండేలా ఈఈలు చర్యలు తీసుకోవాలి. ఐఆర్‌టీ, ఎంఈటీ బృందాల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపేటప్పుడు గత సంవత్సరం ఈ బృందాల వల్ల జరిగిన పని ఎంతతో చెబుతూ ఆ వివరాలతో అవసరమైనన్ని బృందాలకే ప్రతిపాదనలు పంపించాలి. జీహెచ్‌ఎంసీలోని అన్ని డివిజన్లకు నిర్ణీత కాలానికే ఈ బృందాల నియామాకాలకు మంజూరు పొందాలి.
వాహనం, అవసరమైన సామగ్రితో పాటు ఒక్కో షిఫ్టులో నలుగురు కార్మికులు బృందంలో ఉండాలి. కార్మికులకు రేడియం జాకెట్, రెయిన్‌కోటు, షూ, గొడుగు, టార్చి తదితర సదుపాయాలుండాలి. వర్షాలు కురిసే సమయంలో అందే ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిష్కరించడంతో పాటు వర్షాలు లేనప్పుడు గుంతల పూడ్చివేత, రోడ్లపై పూడిక, చెత్త తొలగింపు తదితర పనులు చేయాలి.
బీటీ మిక్స్‌కూ పక్కా లెక్క
గుంతల పూడ్చివేత, రోడ్ల మరమ్మతులకు ఎంత బీటీ మిక్స్ పంపిణీ చేసిందీ సంబంధిత ఈఈ ఏ నెలకానెల వివరాలను చీఫ్ ఇంజినీర్‌కు ఇవ్వాలి. అంతేకాకుండా డిపార్ట్‌మెంటల్ స్టోర్ నుంచి బీటీమిక్స్, రోడ్‌బాండ్, షెల్‌మాక్ వంటివి ఎంత మేర వినియోగించిందీ ఈఈలు తమ ఎస్‌ఈలకు నెలనెలా వివరాలు అందజేయాలి. వాటిని ఎస్‌ఈలు సీఈ ద్వారా కమిషనర్‌కు నివేదించాలి. తద్వారా మెటీరియల్ దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు బృందాలు ఎంత పనిచేసేదీ సరిగ్గా తెలుస్తుందని భావిస్తున్నారు.
వరద కాలువల్లో పూడికతీత
నాలాల్లో పూడికతీతకు సంబంధించి కూడా గ్రేటర్ అధికారులు తగిన విధివిధానాలు రూపొందించారు. మే నెలాఖరు వరకు వర్షాకాలానికి ముందు పూడిక తొలగించడమే కాక డిసెంబర్ నెలఖారు దాకా ఆ పనులు కొనసాగించాలి. ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు కొత్త కాంట్రాక్టు ఒప్పందం అమలులో ఉండాలి.
స్థానికులు, కార్పొరేటర్ల భాగస్వామ్యం
తమ పరిధిలో పూడిక తీయాల్సిన నాలాలెన్నో సంబంధిత ఈఈలు జాబితా రూపొందించాలి. వాటిని గుర్తించడంలో, అంచనాలు రూపొందించడంలో స్థానికులతో పాటు కార్పొరేటర్లను భాగస్వాములను చేయాలి. అంచనాలు రూపొందించేందుకు ముందే నాలా పొడవెంత.. ఎంత పూడిక ఉంటుంది? అనే అంశాలతో పాటు కార్మికులతోనే పూడిక తీయించవచ్చా, లేక యంత్రాలను వినియోగించాలా అనేది అంచనా వేయాలి. పూడిక తీయడానికి ముందు, తీస్తున్నప్పుడు, పూర్తిగా తీశాక ఫొటోలను సంబంధిత బిల్లులతో పాటు జతచేయాలి. చేసిన పనులకు కనీసం ఐదుగురు స్థానికుల సంతకాలతో పాటు, వారి ఫోన్ నంబర్లు ఇవ్వాలి.
రోడ్డుపై గుంతకు వెంటనే రిపేర్
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 79 అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి. రోడ్లపై ఎక్కడైనా గుంత కనిపించినా, డ్రైన్లు పొంగిపొర్లినా ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కరిస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. న్యాక్ ద్వారా ఔట్ సోర్సింగ్‌పై తీసుకున్న ఇంజినీర్ల సేవలను ఈపనులకు వినియోగించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment