సాక్షి, సిటీబ్యూరో : అవినీతి..అక్రమాలు..తూతూ మంత్రపు పనులతో జీహెచ్‌ఎంసీకి భారంగా మారిన స్వీపింగ్ మెషిన్లను విక్రయించాలని నిర్ణయించారు. తద్వారా నెలకు ఖాజానాకు రూ.70 లక్షల భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఊడ్చే యంత్రాలతో రోడ్లు కూడా సక్రమంగా శుభ్రం కావడం లేదని, నిధులు మాత్రం ఖర్చవుతున్నాయే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాలో పెద్ద మెషిన్లను ఒక్కోటి దాదాపు రూ.80 లక్షలు, చిన్న మెషిన్లను ఒక్కోటి దాదాపు రూ.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ పేరిట నిర్వహణ మాత్రం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు.
అందుకుగాను పెద్ద మెషిన్లకు ఒక్కో దానికి గంటకు రూ. 1400 వంతున, చిన్న మెషిన్లకు గంటకు రూ.750 వంతున చెల్లిస్తున్నారు. అలా ఆరు పెద్ద మెషిన్లు, ఇరవై చిన్న మెషిన్లకు వెరసి నెలకు దాదాపు రూ.72 లక్షలు.. సంవత్సరానికి రూ.9 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. అయినా ఈ స్వీపింగ్ మెషిన్లు ఊడుస్తున్న మార్గాల్లో రోడ్లు శుభ్ర పడుతున్నాయా అంటే లేదు. స్వీపింగ్ మెషిన్ వాహనాలు అసలు ఊడ్చాల్సిన ప్రాంతాల్లో రోడ్లను ఊడ్చడమే లేదు. ఏదో కొద్దిదూరం మాత్రం తిరిగినట్లు మమ అనిపించి బిల్లులు కాజేస్తున్నారు. తిరిగిన ప్రాంతంలోనైనా సక్రమంగా ఊడుస్తున్నారా అంటే అదీ లేదు. తిరగని దూరానికి, చేయని పనికి నెలనెలా బిల్లులు మాత్రం చెల్లిస్తున్నారు.
కాంట్రాక్టు ఏజెన్సీల నుంచి సంబంధిత ఏఎంఓహెచ్‌లు, ఇంజినీర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇతరత్రా ఉన్నతాధికారుల దాకా ఎవరి వాటాలు వారికి ముడుతున్నందునే రోడ్లు శుభ్రం కాకున్నా నిధులు మాత్రం స్వీప్ అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఇండోర్‌లో అమలవుతున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడి స్వీపింగ్ మెషిన్ల పనితీరు చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఎంతో శుభ్రంగా రోడ్లను ఊడ్చడమేకాక, ఊడ్చిన వెంటనే దుమ్ము లేవకుండా స్ప్రింకర్ల ద్వారా నీళ్లు కూడా చల్లడం తదితరమైనవి పకడ్బందీగా జరుగుతుండటం పరిశీలించారు. జీహెచ్‌ఎంసీలోని స్వీపింగ్ మెషిన్ల వాహనాలు అసలు తిరగకపోవడం.. తిరిగినా మూడు చీపుర్లలో ఒక్కటి కూడా సరిగ్గా నేలను తాకకపోవడం ఇటీవల ఐటీ కమిషనర్ ముషార్రఫ్ తనిఖీల్లోనూ వెలుగు చూసింది.
ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు దుబారా అవుతున్నందున.. జీహెచ్‌ఎంసీ స్వయంగా నిర్వహించలేకపోతున్నందున ఈ మెషిన్లను తీసేయాలని మేయర్ భావించారు. ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ స్వీపింగ్ మెషిన్ల నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకిచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ఒప్పందం మేరకు చేయాల్సిన పనులేవీ చేయకున్నా, జీపీఎస్ పనిచేయకున్నా, ఇతరత్రా నిబంధనలు అమలు చేయకున్నా కాంట్రాక్టును రద్దు చేయవచ్చు. అయినప్పటికీ, కాంట్రాక్ట్ ఏజెన్సీ, అధికారుల పరస్పర సహకారాలతో నిర్వహణ పేరిట బిల్లులు మాత్రం చెల్లిస్తున్నారు. ఈ దుబారాను ఇకనైనా అరికట్టాలని భావించి ఉపయోగం లేని ఈ స్వీపింగ్‌మెషిన్లను అమ్మేసి, అధునాతనమైనవాటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రైవేట్ వాహనాలదీ అదే తంతు..
జీహెచ్‌ఎంసీ స్వీపింగ్ యంత్రాల పరిస్థితి ఇలా ఉండగా, ప్రైవేట్ సంస్థలకు చెందిన స్వీపింగ్ మెషిన్లు దాదాపు 25 ఉన్నాయి. వాటి నిర్వహణకూడా ప్రైవేట్ ఏజెన్సీదే. వాటి పనితీరూ సరిగ్గా లేకపోవడం తనిఖీల్లో గుర్తించారు. చీపుర్లు రోడ్లను తాకకపోవడం, తిరగాల్సినంత దూరం తిరగకపోవడం, లాగ్ బుక్ నిర్వహించకపోవడం తదితర లోపాలున్నాయి. వీటి విషయంలో ఏంచేయాలా అని యోచిస్తున్నారు. తగిన హెచ్చరికలు జారీచేసి నిబంధనల మేరకు ఒప్పందాల కనుగుణంగా పనిచేయకుంటే కాంట్రాక్టు రద్దు చేసే యోచనలో ఉన్నారు. ఇండోర్ మాదిరిగా రోడ్లను సరిగ్గా శుభ్రం చేసే పక్షంలోనే స్వీపింగ్ మెషిన్లను వినియోగించాలని మేయర్ భావిస్తున్నట్లు సమాచారం. రోడ్లపై దుమ్ములేవకుండా, ఇండోర్ మాదిరిగా రోడ్లను శుభ్రం చేసే అధునాతన స్వీపింగ్ యంత్రాలను వినియోగంలోకి తేవడంతోపాటు నిర్వహణ పకడ్బందీగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment