మహిళలు, బాలికలతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ ఏవీ రంగా సూచించారు.
కస్తూర్బా విద్యార్థినులతో సీఐ రంగా
మోమిన్‌పేట: మహిళలు, బాలికలతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ ఏవీ రంగా సూచించారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులకు ‘బాలికల, మహిళల చట్టాల’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. బాలికలు పాఠశాలకు వచ్చి వెళ్లే సమయాల్లో ఎవరైనా అసభ్యకరంగా వ్రవర్తిస్తే వెంటనే 100కు గాని స్థానిక పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని చెప్పారు. మహిళలకు అండగా ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. బాలికలు, మహిళలు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు.
బాల్య వివాహాలు గ్రామాల్లో ఎక్కువగా జరుగుతుంటాయని, వాటిని నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని సీఐ రంగా కోరారు. ప్రతి కుటుంబంలోని బాలబాలికలు చదువుకునే విధంగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యాచారాలు, గొలుసు చోరీలు, మహిళల అక్రమ రవాణా లాంటివి మీ ఎదుట జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థినులకు సూచించారు. వివరాలు ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలి పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజు, స్థానిక ఉప సర్పం చ్ నర్సింలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.