గ్రేటర్ ఎన్నికల దృష్ట్యానే మజ్లిస్‌తో మంతనాలు
ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఆరోపణ
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఆక్రమణల పేరిట ఇళ్లను కూల్చివేస్తున్న రాష్ట్రప్రభుత్వం మరోవైపు మజ్లిస్‌తో దోస్తీకోసం పలురాయితీలు ప్రకటిస్తోందని ఇదంతా గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి శనివారం బర్కత్‌పురాలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆఫీస్ బేరర్లు, అసెంబ్లీ కన్వీనర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21న సికింద్రాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అభినందన సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొనేలా అమిత్‌షా ఆ సమావేశంలో కార్యకర్తలకు కర్తవ్యబోధన చేసి వారిలో ఉత్సాహాన్ని నింపుతారన్నారు.
ఈనెల 15న గోల్కొండ కోటలో జరిగిన పతాకావిష్కరణ సందర్భంగా పాతబస్తీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారని, అందులో పాత బస్తీలో పురాతన స్థలాల్లో నిర్మించిన బహుళ అంతస్థుల నిర్మాణాలకు ఎలాంటి అపరాధ రుసుము, పన్నులు విధించకుండా ప్యాకేజీలు ప్రకటించేలా సమాలోచన చేసినట్లు తనకు తెలిసిందన్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త చట్టాలు తీసుకురావాలి
రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న చట్టాల స్థానంలో కొత్తవాటిని తీసుకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ న్యాయవాదుల సంఘం ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ భూములకు సంబంధించిన కొన్ని చట్టాలు కోస్తా ప్రాంతానికి అనూకూలమైనవన్నారు. బార్ అసోసియేషన్ చైర్మన్ ఎ. నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల కోసం రూ.వంద కోట్లు కేటాయించడం సంతోషదాయకమన్నారు. ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు విఠల్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాదుల సంఘానికి అధ్యక్షునిగా పిటం ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్య దర్శిగా నరేష్ కుమార్ ఎన్నికయ్యారు.