
బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న అర్బన్ ఎస్పీ
* రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారంతో ఉడాయించిన ఆగంతకులు
వరంగల్, న్యూస్‌లైన్ : సీబీఐ పేరుతో వచ్చిన నలుగురు ఆగంతకులు ఆ ప్లాట్‌లోని నగదు, బంగారు ఆభరణాలను దర్జాగా తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని ఇంట్లో వారు అడగగా మిమ్మలందర్నీ తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేయాల్సి ఉంటుందని భయపెట్టి మరీ వెళ్లిపోయారు. జరిగిన మోసం తెలిసి బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నారుు..
హన్మకొండ హంటర్‌రోడ్‌లోని వైష్ణవి ఆపార్టుమెంట్ డి-2 బ్లాక్‌లో నివాసముంటున్న బానోతు రాజు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం ఆఫీస్‌కు వెళ్లాడు. ఇంట్లో రాజు భార్యాపిల్లలతో పాటు బంధువులు కూడా ఉన్నారు. అయితే మూడు రోజుల క్రితం అతని బావమరిది ఓ ఫ్లాట్ కొనుగోలు కోసం రూ.50 లక్షలను బానోతు రాజు ఇంట్లో ఉంచాడు. మూడు రోజులుగా నగరంలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే రాజు ఇంట్లో భారీ ఎత్తున డబ్బున్న విషయం గమనించిన నలుగురు వ్యక్తులు గురువారం మధ్యాహ్నం సీబీఐ పేరుతో వారి ఇంటికి వచ్చారు. ఇంట్లోకి ప్రవేశించి తాము సీబీఐ అధికారులమని ఇల్లంతా సోదాలు ప్రారంభించారు. రూ.50 లక్షల నగదు ఉంది.. ఎక్కడివంటూ బెదిరించడంతో.. నిజంగా అధికారులేనని రాజు కుటుంబ సభ్యులు నమ్మారు. ఆగంతకులు రూ.50 లక్షలతో పాటు ఇంట్లో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలను పట్టుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే రాజు కుటుంబ సభ్యులు ఎదిరించే ప్రయత్నం చేశారు.
దీంతో ఆ నలుగురు వ్యక్తులు డబ్బు, బంగారంతో పాటు వారిని కూడా ఆఫీస్‌కు తీసుకెళ్లి విచారణ చేస్తామంటూ బెదిరించడంతో వెనక్కి తగ్గారు. ఇదే అదునుగా భావించిన ఆ నలుగురూ అక్కడి నుంచి ఉడాయించారు. అయితే, రూ.50 లక్షలు ఇంట్లో ఉన్న విషయం దగ్గరి వారికే తెలిసి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన ప్రదేశానికి అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, హన్మకొండ డీఎస్పీ దక్షిణామూర్తి, క్రైం డీస్పీ రాజమహేంద్రనాయక్ చేరుకుని విచారణ చేపట్టారు.