ప్రభుత్వ అసమర్థతతోనే రైతు ఆత్మహత్యలు: కటుకం
కరీంనగర్ : ప్రభుత్వ అసమర్థతతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం ఆరోపించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర సర్వే పేరిట పథకాలకు కోతలు పెట్టే ఆలోచనలో సర్కారు ఉందని, అర్హులైన వారికి కోత పెడితే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ప్రతి విషయానికి ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్, టీడీపీలను నిందించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జిల్లా ఎమ్మెల్యేలు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ‘వసూళ్లు చేయాలనుకుంటే తమకో లెక్క కాద’ని మాట్లాడడం అప్రజాస్వామికమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేర్చామన్నారు. నవంబర్ 1 నుంచి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
గ్రీవెన్స్ కార్యాలయం ప్రారంభం
జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గ్రీవెన్స్‌సెల్ (ఫిర్యాదులు స్వీకరించే విభాగం)ను కటుకం ప్రారంభించారు. కార్యాలయంలో ప్రజలు ఎలాంటి సమస్యలైనా ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు చెప్పుకోవచ్చని తెలిపారు.