సోమక్కపేట్‌లో మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి, నర్సాపూర్: మరుగుదొడ్లు నిర్మించకపోయినా, నిర్మించిన వాటిని వాడకపోయినా వారికి ప్రభుత్వం పథకాలు నిలిపివేస్తామని చేస్తామని డీపీవో హనోక్ తెలిపారు. గురువారం చిలప్‌చెడ్ మండలంలోని సోమక్కపేట్ ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మరుగుదొడ్లు నిర్మించుకోని పలు కుటుంబాల కరెంట్, నల్లా కనెక్షన్లు తొలగించారు. ఈ సందర్భంగా డీపీవో హనూక్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛత విషయంలో సోమక్కపేట్ ఉమ్మడి గ్రామ పంచాయతీ అట్టడుగు స్థాయిలో ఉందని ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీలో మొత్తం 430 మరుగుదొడ్ల నిర్మాణాలకు గానూ కేవలం 350 మాత్రమే పూర్తయ్యాయని, ఎన్నిసార్లు అధికారులు స్వచ్ఛత గురించి అవగాహన కల్పించినా గ్రామస్తులు మారకపోవడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు.
ఉమ్మడి సోమక్కపేట్ నుంచి కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన సామ్లా తండా, రహీంగూడ గ్రామాలలో సైతం మరుగుదొడ్లు పరిశీలించి, నిర్మించుకోని పలు కుటుంబాలకు విద్యుత్, నల్లా కనెక్షన్లు తొలగించడంతో పాటు ప్రభుత్వ పథకాలైన రేషన్, పింఛన్ తదితర వాటిని కూడా తొలగిస్తామన్నారు. అదే విధంగా మరుగుదొడ్లు వెంటనే నిర్మించుకున్న వారికి కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి దేవయ్య, ఎంపీడీఓ కోటిలింగం, ఏపీవో శ్యాంకుమార్, మండలంలోని అన్ని గ్రామాల కార్యదర్శులు, సామ్లా తండా సర్పంచ్ భిక్షపతి నాయకులు లక్ష్మణ్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment