ఆదిలాబాద్ క్రైం : ఇటీవల ఎన్నికల్లో ఓటమిపాలైన.. జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. వారి భద్రత కోసం నియమించిన గన్‌మెన్‌లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితోపాటు రాజకీయాలతో సంబంధం ఉన్న కొంతమంది ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులకు ఉన్న భద్రతను కూడా తొలగించినట్లు సమాచారం.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 63 మంది గన్‌మెన్‌లను తొలగించారు. వారికి ఎలాంటి ముప్పులేనందునే గన్‌మెన్లను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు, పలువురు ప్రజాప్రతినిధుల రక్షణకు 79 మంది గన్‌మెన్‌లను కేటాయించారు. రాష్ట్ర మంత్రి జోగురామన్నకు ఆరుగురు గన్‌మెన్‌లతోపాటు, ముగ్గురు ఎస్కార్డ్‌లను నియమించారు. ఎమ్మెల్యేలకు 2+2 గన్‌మెన్లు పనిచేస్తున్నారు.
ఓడిపోయిన వారికి నో..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన జిల్లా మాజీలకు కొత్త తలనొప్పే వచ్చి పడింది. భద్రతను తొలగించిన వారిలో అధికార పార్టీకి చెందిన మాజీల తోపాటు, తాజా వాళ్లు, గతంలో గెలుపొంది.. ఓడిపోయిన నేతలు సైతం ఉన్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్నప్పుడు గత మాజీ నేతలకు గన్‌మెన్లను కేటాయించింది. కొన్నేళ్లుగా జిల్లాలో నక్సల్స్ ప్రభావం లేకపోయినా.. పలుకుబడితో గన్‌మెన్లను తమవద్దే ఉంచుకున్నారు.
అయితే.. ప్రభుత్వం తాజా నిర్ణయం తో వీరంతా ఇప్పుడు తమ భద్రతను పునరుద్ధరించుకు నే పనిలో పడ్డారు. భద్రత కొనసాగించాలంటూ ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నేతలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే భద్రత తొలగించిన ఎంపీ, ఎమ్మెల్యేల వివరాలు సైతం వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. గన్‌మెన్‌లు తొలగించినట్లు తెలిస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందనే అనుమానంతో పోలీసు ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించడం లేదని చెబుతున్నారు.
96 వ్యక్తిగత ఆయుధాలు..
వ్యక్తిగత భద్రత కోసం గతంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు లెసైన్సు ఆయుధాలను పొందారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని కొంత మంది ఈ ఆయుధాలను తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో నక్సల్స్ ప్రభావం లేకున్నా.. వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. అవసరమున్నా.. లేకున్నా.. గత ప్రభుత్వం రాష్ట్ర నేతల సిఫార్సుతో చాలా మందికి ఆయుధాల లెసైన్సు ఇచ్చింది. జిల్లాలో మొత్తం 96 మందికి వ్యక్తిగత ఆయుధాలు ఉన్నట్లు సమాచారం.
ఎన్నికల సమయంలో మాత్రమే వ్యక్తిగత ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారివారికి ఇచ్చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాల నాయకులు.. పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ పలుకుబడితో తమ వద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అవసరం లేని వారి వద్ద కూడా లెసైన్సు ఆయుధాలు ఉండడంతో వారి స్వప్రయోజనాల కోసం వాటిని అక్రమ దందాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ముప్పు ఉన్న వారికి తప్ప మిగతా వారి నుంచి ఆయుధాలు వెనక్కి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
భద్రత తగ్గిస్తున్నాం.. - గజరావు భూపాల్, ఎస్పీ
జిల్లాలో మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారికి ఉన్న భద్రతను తగిస్తున్నం. అయితే.. ఎవరెవరికి భద్రత తొలగించామన్న వివరాలు గోప్యంగా ఉంటాయి. భవిష్యత్తులో భద్రత దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే భద్రత తొలగించిన నేతల వివరాలు చెప్పడం లేదు.
నో సెక్యూరిటీ..
Published Wed, Aug 27 2014 12:09 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement