ప్రభుత్వ నిర్మాణాల్లో రాతి ఇసుక
‘సాక్షి’తో మంత్రి హరీశ్‌రావు
ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేస్తాం
కృత్రిమ ఇసుక వినియోగంపై ప్రజలకూ అవగాహన కల్పిస్తాం
ఇసుక తవ్వకాలపై పటిష్ట విధానం.. మాఫియాకు చెక్‌పెట్టే చర్యలు
పూడిక పేరుకున్న చెరువులు, రిజర్వాయర్లు,
వాగుల్లో తవ్వకాలకు అనుమతి
2015 ఖరీఫ్ నాటికి 8- 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
హైదరాబాద్: అన్ని ప్రభుత్వ నిర్మాణాల్లో సాధారణ ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుక (రాళ్లను పగలగొట్టి రూపొందించే ఇసుక - రోబో శాండ్)ను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, గనుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో రాతి ఇసుక తయారీని ప్రోత్సహిస్తామని.. దీని వినియోగంపై ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తామని వెల్లడించారు. దీనివల్ల ఇసుక కొరతను నివారించడంతోపాటు ప్రజలకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న ఇసుక విధానంలో చాలా సమస్యలున్నాయని, వాటిని సవరించాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణలో ఇసుక విధానం, సమస్యలు, నీటి పారుదల ప్రాజెక్టులు తదితర అంశాల్లో చేపట్టనున్న పలు చర్యలపై హరీశ్‌రావు ‘సాక్షి’కి పలు వివరాలను వెల్లడించారు. ఈ అంశాలపై ఆయన మాటల్లోనే...
ప్రత్యామ్నాయంపై దృష్టి..
రాతి ఇసుక వాడకంపై ప్రజల్లో ఇంకా చైతన్యం పెరగాలి. సాధారణ ఇసుకను వినియోగిస్తే నిర్మాణం ఎంత పటిష్టంగా ఉంటుం దో.. రాతి ఇసుకను వినియోగించినా అంతే పటిష్టంగా ఉం టుంది. ఒకవైపు దళారీ వ్యవస్థను, ఇసుక మాఫియాను నియంత్రిస్తూనే... మరోవైపు ప్రత్యామ్నాయ ఇసుక వాడకంపై దృష్టి కేంద్రీకరిస్తాం. హైదరాబాద్ శివార్లకు దూరంగా ఉన్న కొండ లు, గుట్టల్లో రాతి ఇసుక తయారీకి చాలా అవకాశాలున్నాయి. దీని తయారీ సామర్థ్యాన్ని పెంచుతూనే.. వాడకాన్ని పెంచేం దుకు చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ నిర్మాణాల్లో రాతి ఇసుకనే వినియోగించే విధంగా చర్య లు చేపడతాం. దీనికోసం అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇకపై అన్ని ప్రభుత్వ నిర్మాణాల్లో రాతి ఇసుక వినియోగమే ఉంటుంది.
వెంటనే నీరిచ్చేవాటికి ప్రాధాన్యత
వచ్చే ఏడాది ఖరీఫ్‌నాటికి తెలంగాణ రాష్ట్రంలో కనీసం 8 నుంచి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అందుకోసం ఇప్పకిప్పుడే నీరు అందించగలిగే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా ఈ ఏడాది తీసుకుంటున్నాం. కరువు తీవ్రత ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఆర్డీఎస్, భీమా ఎత్తిపోతల పథకాలకు రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెడితే నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో కలిపి మరో నాలుగైదు లక్షల ఎకరాలకు కొత్తగా నీరివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. వీటితో పాటు చిన్న నీటి వనరులు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. వచ్చే ఖరీఫ్ నాటికి కనీసం 250 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చిన్న నీటి వనరుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ముందు అనుమతులు తెస్తాం..
ప్రాణహిత-చేవెళ్ల పథకానికి రూ. 35 వేల కోట్లు ఖర్చవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే దీన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాకోసం పోరాడుతాం. అంతకంటే ముందు ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులకోసం పనిచేస్తున్నాం. అటవీ, పర్యావరణ, భూగ ర్భ, వాతావరణ శాఖ అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుతో మహారాష్ట్రలో కొంత ముంపు ఉంటుంది. దీనిపై 23వ తేదీన ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. అన్ని అనుమతులు సాధించి.. జాతీయ హోదా కోసం ఒత్తిడి తెస్తాం.
ఇసుక విధానంపై అధ్యయనం
‘ఇసుక విధానంపై ఎంపిక చేసిన కొన్ని మండలాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని, సమస్యలను అధ్యయనం చేస్తున్నాం. ఇసుక తవ్వకాలకు జిల్లా కలెక్టర్ మాత్రమే అనుమతి ఇవ్వాలనే నిబంధనల వల్ల పలు సమస్యలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ప్రభుత్వానికి పన్ను రాకు న్నా.. వినియోగదారులకు ఇసుక తక్కువ ధరకు దొరుకుతున్నదా? అంటే అదీ లేదు. ఇసుక తవ్వకాల అనుమతులకు సంబంధించిన అధికారాన్ని రెవెన్యూ అధికారులకు ఇవ్వా లా? లేదా దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటుచేయాలా? అనేదానిపై అధ్యయనం చేస్తున్నాం. భూగర్భజలాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా, వినియోగదారులకు మేలు కలిగే విధంగా మధ్య దళారీ వ్యవస్థను అరికట్టేలా ఇసుక విధానం రూపొందించాలనుకుంటున్నాం. ఇక చెరువులు, రిజర్వాయర్లు, పెద్ద పెద్ద వాగులు కొన్ని పూడికతో నిండిపోయినట్టుగా నివేదికలు వస్తున్నాయి. వాటిల్లో ఇసుక తవ్వకాలకు కొంతకాలం అనుమతిస్తే పూడిక తగ్గిపోయి, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. పారదర్శకంగా టెండర్లు వేసి, ప్రభుత్వానికి ఆదా యం సమకూరే విధంగా చర్యలు తీసుకోవాలని ఉంది.