ఆరుగాలం కష్టపడే అన్నదాతకు పంట అమ్మకంలోనూ తప్పని అవస్థలు... సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. గన్నీ సంచుల సరఫరాలో నిర్లక్ష్యం.. ధాన్యం రవాణాలో జాప్యం.. హమాలీల కొరత.. వెరసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు.
ఈ రబీ సీజన్‌లో జిల్లాలో 2.30 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. 13 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన అధికారులు 619 కొనుగోలు కేంద్రాల ద్వారా 5 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నెల 4న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు 341 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, 13 మార్కెట్ కమిటీల ద్వారా 1.54 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. వరికోతలు ముగింపు దశకు చేరడంతో ధాన్యం కుప్పలుతెప్పలుగా వచ్చి చేరుతోంది. కేంద్రాలకు రోజువారీగా వస్తున్న ధాన్యంలో కనీసం 40 శాతం కొనుగోళ్లు కూడా జరగడం లేదని రైతులు అంటున్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రవాణా చేసుకోవాల్సిన మిల్లర్లు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు. రోజుకు నాలుగైదు లారీల ధాన్యం కేంద్రాలకు వస్తుంటే.. ఒకట్రెండు వాహనాలు మాత్రమే మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ధాన్యం కేంద్రాల్లోనే మూలుగుతోంది. కొనుగోళ్లు ఆలస్యమవుతుండడంతో అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. శనివారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో, కోరుట్ల మండలం పెద్దాపూర్ రైతులు, ముస్తాబాద్ రైతులు, కాటారం మండలం రేగులగూడెంలో ఆందోళనకు దిగారు. హుస్నాబాద్‌లో సిబ్బందిని నిర్బంధించారు.
వసతులేవీ.. పైసలేవీ?
ఎన్నికల నేపథ్యంలో ఇంతకాలం అధికారులు రైతుల గోడు పట్టించుకున్న దాఖలాలు లేవు. కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతులకు నోచుకోకపోవడంతో నిల్వలు పేరుకుపోయూరుు. కొనుగోలు చేసిన ధాన్యంలో 40 శాతం కేంద్రాల్లోనే పేరుకుపోగా.. ఎప్పటికప్పుడు రవాణా కాకపోవడంతో కొత్తగా కొనుగోళ్లు జరగడం లేదు. 50 లక్షల వరకు గన్నీ సంచులు అవసరమున్నా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచలేదు.
ఇప్పటివరకు 270 ఐకేపీ కేంద్రాల ద్వారా 89,683 టన్నులు, 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 64,231 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా చెల్లించలేదు. రూ.207 కోట్లు చెల్లింపు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈసారి రైతులకు ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలు, వివరాలను డాటా ఎంట్రీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో విక్రయించిన ధాన్యం చెల్లింపులు మరింత ఆలస్యం కానుండడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
దళారులతో దగా..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,345 కాగా.. రైతులు ఎక్కువగా ఆయా కేంద్రాలకే ధాన్యాన్ని తరలిస్తున్నారు. తూకం, రవాణాలో జాప్యం కావడంతో రోజుల తరబడి పడిగాపులు కాయలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని కల్లాల వద్ద దళారులు క్వింటాల్‌కు రూ.1,260కే కొనుగోలు చేసి అన్నదాతల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు.
అధికారులు, దళారులు కుమ్మక్కై మార్కెట్‌లో ధాన్యం త్వరగా కొనుగోలు చేయకుండా వివిధ కారణాలతో తమ సహనాన్ని పరీక్షిస్తూ ధాన్యాన్ని దళారుల పాలు చేసేలా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం 4, 5 కాంటాలు ఏర్పాటు చేసి ఏరోజుకారోజు ధాన్యాన్ని తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని, హమాలీ డబ్బులు సైతం త్వరగా ఇప్పించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
వాహనాలు సమకూరుస్తాం
- బి. చంద్రప్రకాశ్, డీఎస్వో
కొన్ని చోట్ల ధాన్యం రవాణాలో ఇబ్బందులు తలెత్తిన విషయం మా దృష్టికి వచ్చింది. రవాణా బాధ్యతను మిల్లర్లకు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లకు అప్పగించాం. తిరిగి సమస్య తలెత్తడంతో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లకు సూచించాం. సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో అన్ని సెంటర్లు పరిశీలించి రెవెన్యూ, పోలీస్, సివిల్‌సప్లై శాఖలు సంయుక్తంగా వాహనాల సమకూర్పునకు చర్యలు తీసుకుంటాం.
చెల్లింపులో ఆన్‌లైన్లోనే..
- సంపత్, సివిల్‌సప్లై డీఎం
ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదు. రూ.207 కోట్లు చెల్లించాల్సి ఉంది. జేసీ ఆదేశాల మేరకు ఈసారి రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లిస్తాం. ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు రైతుల వివరాలను డాటా ఎంట్రీ చేసే పనిలో ఉన్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లిస్తాం.
ఎక్కడి ధాన్యం అక్కడే..
Published Sun, May 18 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM
Advertisement
Advertisement