అమ్రపాలికి జ్ఞాపికను అందజేస్తున్న అధికారులు
ఖిలా వరంగల్ : ప్రజల భాగస్వామ్యం, అధికా రుల సహకారంతోనే అర్బన్ జిల్లాను అభివృద్ధిలో ముందుంచామని కలెక్టర్ అమ్రపాలి కాట అన్నారు. జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయిన ఆమెకు ఖిలావరంగల్ మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్స్ పార్కులో గురువారం రాత్రి అత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పర్యాటకశాఖ జిల్లా అధికారి డీఎస్.జగన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జెడ్పీ సీఈఓ విజయగోపాల్, డీఆర్‌డీఓ అధికారి రాము, డీఆర్‌ఓ డేవిడ్‌రాజు, సీఓ శ్రవణ్, జేసీ దయానంద్, ఆర్‌డీఓ బుచ్చిరెడ్డి, డీఎంహెచ్‌ఓ హరీష్‌రాజు, ఇతర శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ముందుగా అమ్రపాలికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ తాను అనుకున్న లక్ష్యానికి సులభంగా చేరుకున్నాని చెప్పారు. తాను విధులు నిర్వర్తించిన 22 నెలల 15 రోజుల కాలం గొప్ప అనుభూతిని అందించిందన్నారు. జీవితంలో గుర్తుండేలా జీవిత భాగస్వామిని అందించిన నేలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్నారు. కోట అందాలు మరింత ఆకర్షణగా నిలవాలంటే మరో రెండు సంవత్సరాల కాలం పడుతుందని.. ప్రపంచ పర్యాటకులను ఆహ్వానించేలా పక్కా ప్రణాళికలతో అభివృద్ధికి చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. మహా నగరపాలక సంస్థ ద్వారా నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు రూపకల్పన చేశామని, అండర్ డ్రెయినేజీ, రోడ్ల విస్తరణ, గార్డెనింగ్స్, సెంటర్ లైటింగ్స్, గ్రీనరీ, జంక్షన్ల అభివృద్ధి జరగనున్నాయన్నారు.
జిల్లాల విభజన తర్వాత చారిత్రక వరంగల్‌లో మొదటిసారిగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం అనందంగా ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యం మరువలేనిదని, తనకు సహాయసహకారాలు అందించిన ఉద్యోగులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు తెలం గాణ సాంస్కృతిక కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మిమిక్రీ కళాకారుడు వెంకి హాస్యం ఆహూతులను కడుపుబ్బా నవ్వించింది. సమావేశంలో జిల్లాలోని రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment