సార్..! సమస్యలు ఆలకించండి !!
- ప్రజావాణిలో వినతుల వెల్లువ
- స్వయంగా అర్జీలు స్వీకరించిన జేసీ వెంకట్రాంరెడ్డి
సంగారెడ్డి జోన్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. జేసీ వెంకట్రాంరెడ్డి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. విచారణ చేసి సత్వరం న్యాయం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
తన ప్రమేయం లేకుండానే తన భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన డిప్యూటీ తహసీల్దార్, గ్రామ పట్వారీలపై చర్యలు తీసుకోవాలని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన ప్రభాకర్ కోరారు. తన 2 ఎకరాల 20 గుంటల భూమిని ఎలాంటి అనుమతి లేకుండా ఇతరులపై రిజిస్ట్రేషన్ చేశారని, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తమకు ఎకరా భూమి పట్టా ఇచ్చారని, కానీ ఇంతవరకు పొజిషన్ చూపించలేదని పాపన్నపేట మండలం మిన్పూర్‌కు చెందిన ఏసమ్మ, బాలమ్మలు తెలిపారు. తమకు వెంటనే పొజిషన్ చూపించాలని, లేకుంటే మూడెకరాల భూమి ఇప్పించాలని జేసీకి విన్నవించారు.
మావోయిస్టుగా జనజీవన శ్రవంతిలోకి వచ్చిన తనకు ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని మెదక్ మండలం తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పోచయ్య కోరారు.
విధి నిర్వహణలో తన భర్త మతిస్థిమితం కోల్పోయినందునా తనకు ఉపాధి కల్పించాలని కొండాపూర్‌మండలం మారేపల్లికి చెందిన ఇందిరమ్మ విజ్ఞప్తి చేశారు.
బీడీ కార్మికులైన తమకు ఇళ్లు మంజూరు చేయాలని అందోల్ మండలానికి చెందిన సువర్ణ, దుబ్బాక మండలం ఆరేపల్లికి చెందిన సునీత, యాదమ్మ వినతిపత్రం అందజేశారు.
తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్‌కు చెందిన కోనమ్మ విజ్ఞప్తి చేశారు.
తన భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించానని, ఈ కారణంగా తమ కూ తురుకు బాలిక సంరక్షణ పథకం వర్తింపజేయాలని జహీరాబాద్ పట్టణం శాంతినగర్ కుచెందిన మంగళి విజయకుమార్ కోరారు.
తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని ఆస్తినంతా వారికే ఇచ్చారని, న్యాయంగా తనకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇప్పించాలని న్యాల్‌కల్‌కు చెందిన అంజమ్మ జేసీకి విజ్ఞప్తి చేసింది.
తన భూమిలో అక్రమంగా ఇతరులు రోడ్డు వేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోహీర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన మల్లయ్య కోరారు.
మెదక్ మండలం హవేళీఘన్‌పూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి విక్రయిస్తున్నాడని, తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.
తనకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని అందోల్ మండలం పోసానిపేటకు చెందిన వడ్డే యాదమ్మ కోరారు.
తాను గత 30 సంవత్సరాలుగా పిండి గిర్ని నడిపిస్తూ జీవనం సాగిస్తున్నానని, దాన్ని తొలగించాలని అధికారులు యత్నిస్తున్నట్టు చేగుంటకు చెందిన రాజలింగం తెలిపారు. పిండి గిర్ని యథావిధిగా నడిపించుకొనేందుకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు.
సత్వరమే సమస్యల పరిష్కారం : ఎస్పీ
సంగారెడ్డి క్రైం : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ బి.సుమతి సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు సూచిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.