‘రికార్డులు’ రాస్తోంది!
చూశారా.. ఎంత పే....ద్ద కలమో.. 37.23 కిలోల బరువు ఉన్న ఈ పెన్ను ఎత్తు 18.53 అడుగులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కలంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అంతేకాదు మరో ఏడు రికార్డులను కూడా సొంతం చేసుకుంది. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దీన్ని ప్రదర్శించారు. 448 రోజులు కష్టపడి ఇత్తడితో దీన్ని తయారు చేసినట్లు రూపకర్త ఎం.ఎస్.ఆచార్య తెలిపారు.
ఈ పెన్ను తయారీకి రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు. కలంపై భారతీయ నృత్య భంగిమలు, సంగీత వాయిద్యాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, అమేజింగ్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, ఆర్.హెచ్.ఆర్ రికార్డు, ఎవరెస్టు వరల్డ్ రికార్డులు వచ్చాయని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, దైవజ్ఞశర్మ భారీ కలంతో జై తెలంగాణ, జై కేసీఆర్ అని రాశారు.