కూటికని పోయి ‘​కాటికి’పోయిర్రు | Gulf Difficulties | Sakshi
Sakshi News home page

కూటికని పోయి ‘కాటికి’పోయిర్రు

Published Thu, Nov 22 2018 4:32 PM | Last Updated on Thu, Nov 22 2018 4:32 PM

Gulf Difficulties  - Sakshi

సాక్షి, ఖానాపూర్‌: పొట్ట కూటి కోసం ఎడారి దేశాలకు వలస వెళ్లిన బతుకులకు భరోసా కరువైంది. ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. నెర్రెలు బారిన నేలతల్లి ఆదుకోక.. ఆర్థికంగా చితికి.. అప్పు మూటతో విదేశాలకు వెళ్లిన వారిలో మోసపోయిన వారు కొందరైతే.. తిరిగిరాని లోకాలకు చేరిన వారు మరికొందరు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు గల్ఫ్‌ మానని గాయాలు మిగిల్చింది. అక్కడ జరిగిన పలు ప్రమాదాలతో పాటు గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు, వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాల గుండె కోత తీర్చలేనిది. ఆయా కుటుంబాలకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఎక్స్‌గ్రేషియా రాకపోవడంతో వారంతా దీనస్థితిలో ఉన్నారు.
  

మోసపోతున్న కుటుంబాలు...  
గల్ఫ్‌ దేశాలకు వెళ్లి మోసపోతున్న వలసజీవుల బాధలు చెప్పలేకుండా ఉన్నాయి. బోగస్‌ ఏజెంట్లు నకిలీ, విజిట్‌ వీసాలను కంపెనీ వీసాలుగా నమ్మిస్తే గంపెడాశతో అక్కడికి వెళ్లిన అనేక మంది దిక్కుతోచని స్థితిలో ఉండగా ఎంతో మంది పలు కారణాలతో మృత్యువాత పడుతున్నారు. వీటన్నింటిని నకిలీ ఏజెంట్‌ వ్యవస్థే శాసిస్తోంది. అనివార్య కారణాలతో మృతి చెందిన కుటుంబాల మృతదేహాలు సైతం స్వదేశానికి తీసుకురావడానికి ఏడాదికిపైగా బాధిత కుటుంబాలు తడారిన కళ్లతో వేచి చూడాల్సి దుస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు గల్ఫ్‌ సమస్యలను మేనిఫెస్టోలో చేర్చి వలస కుటుంబాలకు న్యాయం చేసేలా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
 

ఇవీ నిబంధనలు... 
విదేశాల్లో ఉన్న ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్‌ పొంది ఉండాలి. కేంద్రం వద్ద రూ. 50 లక్షలు డిపాజిట్‌ చేయాలి. వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి. ఉద్యోగ వివరాలతో పత్రిక ప్రకటన ఇవ్వాలి. స్థానికులు, అధికారుల అనుమతి పొంది ఉండాలనే నిబంధనలు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. వీటిని పాటించని కంపెనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వారి డిపాజిట్‌ జప్తుతో పాటు లైసెన్స్‌ రద్దు అవుతుంది. అయితే బహిరంగంగా నకిలీ ఏజెంట్లు నిర్వహించే ఇంటర్వ్యూలు, జారీచేసే ప్రకటనలపై స్థానిక పోలీసు, రెవెన్యూ విభాగాలు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని, పాస్‌పోర్టులు మొదలు వీసాలు, టికెట్ల సేవలందించే పేరుతో ఏర్పాటు చేసే సంస్థల్లో బోగస్‌వే ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల వరకు ఇలాంటి ఏజెన్సీలు ఉన్నాయి. రెండు ప్రభుత్వ కంపెనీలైనా ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓంకాం, స్వరాష్ట్రంలో ఏర్పాటు చేసిన టాంకాంతో పాటు 29 కంపెనీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్‌లు ఉన్నాయి.
 

తగ్గని గల్ఫ్‌ చావులు.. 
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని ఎంతో మంది గల్ఫ్‌ కార్మికులు వివిధ కంపెనీల్లో పనిచేయగా, వేలాది మంది కార్మికులు వీసాలు లేకుండా కల్లివెల్లి అవుతున్నారు.

గల్ఫ్‌ నుంచి వచ్చిన మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు(ఫైల్‌)   

ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఆశల సౌదంలో గల్ఫ్‌ బాట పడుతున్న పలువురు అక్కడే మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో కొందరు మృతి చెందుతుండగా.. అధిక పనిబారం, వేతనం తక్కువ, కంపెనీల వేదింపులతో ఎంతో మంది గుండెపోటుకు గురవ్వడం, ఆత్మహత్యలు చేసుకోవడం, అనారోగ్యంతో మృతి చెందడం జరుగుతుంది.
 

ఒకే ప్రమాదంలో జిల్లాలోని   ముగ్గురు మృతి 
దుబాయ్‌లోని అబుదాబికి 10 కిలోమీటర్ల దూరంలోఉన్న అల్రీమ్‌ ఐలాండ్‌లో గతేడాది అక్టోబర్‌ 19న జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణలోని ఐదుగురు కార్మికులు అక్కడిక్కడే కాలి బూడిద కాగా, అందులో జిల్లావాసులే ముగ్గురు ఉన్నారు.

సత్తన్‌పల్లికి చెందిన ప్రకాశ్‌ మృతితో పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబం    

ఈ ప్రమాదంలో క్యాంపులోని రూం నెం.20లో గల నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం  సేవానాయక్‌ తండాకు చెందిన ఎం.ప్రకాష్‌ నాయక్‌ (29), రూం నెం.30లో మామడ మండలం పొన్కల్‌కు చెందిన గాండ్ల్ల అఖిలేష్‌ (22), సారంగాపూర్‌కు చెందిన మంచాల నరేష్‌ (29) ఉండగా.. రూం నెం.17లో గల కామారెడ్డిలోని మాచారెడ్డి చౌరస్తాకు చెందిన పిట్ల నరేష్‌ (25), నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌కు చెందిన తోట రాకేశ్‌ (32)లు ఆహుతయ్యారు.  


గల్ఫ్‌లోనూ నిబంధనలు తూచ్‌ .. 
దుబాయిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనలో సదరు కంపెనీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. సెంచురి అనే కంపెనీకి చెందిన జిలానీ అనే క్యాంపును నిర్వాహకుల నుంచి గల్ఫ్‌ డ్యూమ్స్‌ అనే కంపెనీ అద్దెకు తీసుకుని, తన కంపెనీకి చెందిన కార్మికులకు వసతి కల్పించింది. ఈ క్యాంపు యూఏఈ ప్రభుత్వ నింబంధనల ప్రకారం లేదు. ఇది 30ఏళ్ల క్రితం నిర్మించిన రేకుల షెడ్డులో ఉంది. అక్కడి అనేక క్యాంపుల్లో గ్యాస్‌ను కాని, బయట ఆహారాన్ని గాని క్యాంపుల్లోకి అనుమతించరు.

దుబాయ్‌లోని కంపెనీలో అగ్నిప్రమాద  దృశ్యం(ఫైల్‌)   

అలాగే ఈ క్యాంపులో కూడా ఎలాంటి గ్యాస్‌ సిలిండర్లను, వంట చేసుకోవడానికి అనుమతించరు. క్యాంపునకు సమీపంలో ఉన్న మెస్‌లోనే వీరంతా భోజనం చేస్తారని అక్కడి కార్మికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి కారణం కార్బన్‌ మిథైల్, టోక్సిస్‌ గ్యాసెస్‌ అయి ఉంటాయని వీటికి చాలా వేగంగా మండే గుణం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ ప్రమాదానికి గ్యాస్‌సిలిండర్‌ అనే సమస్యే తలెత్తదని పేర్కొన్నారు. కేవలం షార్ట్‌సర్క్యూట్‌ కారణంతోనే కార్మికులు మృతి చెందారని సంఘటన తీరుతో తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement