హరీష్‌ ఆపరేషన్‌..! | Harish Operacion Start For Pre Election | Sakshi
Sakshi News home page

హరీష్‌ ఆపరేషన్‌..!

Published Sat, Nov 24 2018 8:22 AM | Last Updated on Wed, Mar 6 2019 6:03 PM

 Harish Operacion Start For Pre Election - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కలిగిన జిల్లాల్లో ఉమ్మడి పాలమూరు ఒకటి. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ద్వారా మెజార్టీ సాధించొచ్చన్నది అన్ని పార్టీల భావన. అందుకే మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్ని పార్టీల మాదిరిగానే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ప్రచార శైలిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

అయితే, కొన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని కేసీఆర్‌ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరు ఉన్న మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపారు. ఆయా నియోజకవర్గాల్లో నిరంతరం ప్రత్యేక సమీక్షలు జరుపుతున్న హరీశ్‌.. శనివారం గద్వాల, మక్తల్‌ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌కు కాస్త క్లిష్టంగా ఉన్నట్లు భావిస్తున్న నియోజకవర్గాలపై ఆ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని కొడంగల్, గద్వాల్, అలంపూర్, మక్తల్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు సర్వే నివేదికల వెల్లడైందని చెబుతూ... గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపారు.

దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం హరీశ్‌రావు వ్యూహ, ప్రతివ్యూహాలు చేస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇదివరకే ఈనెల 17న ఒకసారి గద్వాల్, అలంపూర్‌లో పర్యటించిన ఆయన శనివారం మక్తల్, గద్వాల్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇలా మొత్తం మీద జిల్లాలో మంత్రి హరీశ్‌ పర్యటనలతో హోరెత్తిస్తున్నారు.  


 ప్రత్యేక దృష్టి 
ఉమ్మడి పాలమూరు జిల్లా విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో అత్యధిక స్థానాలు గెలుపొందాలని భావిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని కొన్ని స్థానాల్లో పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కొడంగల్, గద్వాల్‌ వంటి చోట్ల కాంగ్రెస్‌ తరఫున బలమైన నేతలు ఉండటంతో... వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు కసరత్తు చేస్తున్నారు.

అంతేకాదు ఈ రెండు నియోజకవర్గాలకు రెండు, మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే అరుణ, ఎనుముల రేవంత్‌రెడ్డిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రాకుండా చూడాలని గట్టి పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రెండు చోట్ల టీఆర్‌ఎస్‌లో లుకలుకలు ఉన్నట్లు తెలుస్తుండగా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ట్రుబల్‌ షూటర్‌ను రంగంలోకి దింపారు.

అదే విధంగా మక్తల్, అలంపూర్‌ల్లో కూడా గ్రూపు తగాదాల నేపథ్యంలో పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మక్తల్‌లో ఏకంగా పార్టీకే చెందిన ఎం.జలందర్‌రెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో పార్టీ అభ్యర్థి విజయం సాధించాలనే యోచనతో హరీశ్‌రావు ప్రయత్నం చేస్తున్నారు.

అలంపూర్‌లో సైతం పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి నేరుగా టికెట్‌ ప్రకటించడం.. పాత కేడర్‌తో కాస్త గ్యాప్‌ ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ హరీశ్‌ సరిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలో ఆయన ఈనెల 17న అలంపూర్, గద్వాల్‌ల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై అభ్యర్థి విజయాలకు పాటుపడాలని సూచించారు.

 
ప్రత్యేక నివేదికలు 
గులాబీ బాస్‌ కేసీఆర్‌కు రాష్ట్ర స్థాయిలో డీ.కే.అరుణ, ఎనుముల రేవంత్‌రెడ్డి తరచూ సవాళ్లు విసురుతున్నారు. దీంతో వీరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల్, కొండగల్‌ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితిలో గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా రంగంలోకి దిగిన హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

నియోజకవర్గంలో ఎవరు బలమైన నేతలు... ఎక్కడెక్కడ ఎవరెవరిని పార్టీలోకి తీసుకొస్తే లాభం జరుగుతుందనే అంశంపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు కొడంగల్‌ నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాలు, ప్రతీ గ్రామం చొప్పున నివేదిక రూపొందించినట్లు సమాచారం.

వీటన్నింటినీ క్రోడీకరించి.. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిచేస్తున్నారు. అందులో భాగంగానే మంత్రి హరీశ్‌రావు విస్తృతంగా పాలమూరు జిల్లా పర్యటనలు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement