సాక్షి, సిద్దిపేట: ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు ప్రవేశపెట్టాల్సి వస్తుంది. నూతన ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అయినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఆపడం లేదు’ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, సిద్దిపేట పట్టణంలోని పల్లె ప్రగతితోపాటు పలు కార్యాక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లి కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి పుట్టి, పెరిగి పెద్దయి తర్వాత చదువులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అందిస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా గర్భిణులకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడకుండా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో రైతన్నలు ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా రాష్ట్రాన్ని వెలుగుల మయం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజలు తమ హక్కుల కోసం ఆందోళనలు, ధర్నాలు చేసేవారన్నారు. ప్రజల మనసు, పేదల బతుకులను దగ్గరగా చూసిన కేసీఆర్ సీఎంగా ఉండటంతో పేదలు అడగకుండానే వారి అవసరాలను తీర్చే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment