సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇళ్లకు వెళుతున్న ‘సాక్షి’ సబ్ ఎడిటర్లపై అకారణంగా దాడి చేసి నిర్బంధించిన హెడ్ కానిస్టేబుల్ కె.పద్మారావు వ్యవహారాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి సర్కిల్ పరిధిలోని రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పద్మారావు గత చరిత్ర కూడా వివాదాస్పదమేనని పోలీసుల విచారణలో తేలింది. తాజాగా ‘సాక్షి’ సబ్ ఎడిటర్లపై అకారణంగా దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండడంతో శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించింది. సదరు హెడ్ కానిస్టేబుల్ కొడుకుపై కూడా గతంలో కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో దాడి కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పాత కేసులను తిరగతోడిన కరీంనగర్ పోలీసులు పద్మారావు తీరుపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి కరీంనగర్ కమిషనర్, సిరిసిల్ల ఎస్పీకి
పంపించారు.
కోతిరాంపూర్‌లో సదరు హెడ్ కానిస్టేబుల్ నివసిస్తున్న ఇంటి సమీపంలోనే అతని మేనత్త కాంతమ్మ పేరిట 170 గజాల ఆస్తి ఉంది. 2015లో అక్కడ ఇల్లు నిర్మించుకునేందుకు కాంతమ్మ కుటుంబం ప్రయత్నిస్తుండగా, దాన్ని అడ్డుకునేందుకు, ఆస్తిని స్వాధీనం చేసుకునే క్రమంలో 2015, మార్చి 26న అర్ధరాత్రి ఆ కుటుంబంపై దాడికి దిగారు. అప్పట్లో కథలాపూర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఇతను తన కొడుకుతో కలిసి దాడి చేసినట్లు 2015, మార్చి 27న కేసు (నంబర్ 120/ 2015) నమోదైంది.
ఈ కేసులో కూడా పద్మారావు మొదటి నిందితుడు (ఎ–1) కావడం గమనార్హం. ఐపీసీ సెక్షన్లు 448, 427,290, 323, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 10వ తేదీ రాత్రి కోతిరాంపూర్‌లో ‘సాక్షి’ సబ్ ఎడిటర్లపై దాడి కేసు (నంబర్ 255/2019)లో ఐపీసీ 290, 323, 34, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదయింది. అకారణంగా జర్నలిస్టులపై దాడి చేసి, నిర్బంధించి గాయపరిచిన పద్మారావు, అతని కొడుకు ప్రదీప్, పద్మారావు బంధువులపై పెట్టిన కేసులో ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, పద్మారావుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా, పద్మారావు కానిస్టేబుల్‌గా ఉన్నప్పుడే దాడి కేసులు నమోదైనప్పటికీ, అతనికి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించడం గమనార్హం.
ఎన్నికల విధుల పేరిట వచ్చి కరీంనగర్‌లో మకాం...
సిరిసిల్ల జిల్లా చందుర్తి సర్కిల్ పరిధిలోని రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పద్మారావు ఈనెల 10న బోయినపల్లిలో ఎన్నికల డ్యూటీ పేరిట రిలీవ్ అయి వచ్చాడు. అదే రోజు పద్మారావు ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో కరీంనగర్ కోతిరాంపూర్‌లోని ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం నుంచే మొదలైన విందు అర్ధరాత్రి వరకు సాగడం, రాత్రి 12.40 గంటల సమయంలో సబ్ ఎడిటర్లు డ్యూటీ ముగించుకుని రావడంతో ముందు కొడుకు, తరువాత తండ్రి దాడికి తెగబడ్డారు. మద్యం మత్తులో ఫంక్షన్‌కు వచ్చిన బంధువులు కూడా సబ్ ఎడిటర్లు రాములు, వెంకటేశ్‌పై దాడి చేసి, నిర్భందించడం గమనార్హం. కోతిరాంపూర్ బస్తీలో రౌడీయిజం ప్రదర్శించడంపై బస్తీలోని మిగతా కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రదీప్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి: టీయూడబ్ల్యూజే
సాక్షి సబ్ ఎడిటర్లు రాములు, వెంకటేశ్‌పై అకారణంగా దాడి చేసి, నిర్బంధించిన హెడ్ కానిస్టేబుల్ పద్మారావును సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని, అతని కొడుకు ప్రదీప్‌పై రౌడీషీట్ తెరవాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మారుతి స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హెడ్ కానిస్టేబుల్‌గా ఉంటూనే జర్నలిస్టులపై రౌడీయిజం ప్రదర్శిండంతోనే పద్మారావు నేరప్రవృత్తి తెలుస్తుందని పేర్కొన్నారు. అతని కొడుకు ప్రదీప్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అర్ధరాత్రి బస్తీల్లో తిరుగుతూ రౌడీయిజం చేస్తున్న ప్రదీప్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలని కమిషనర్ కమలాసన్‌రెడ్డిని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment