తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాణిజ్యపంటలతో పాటూ కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. కాగా భారీ వర్షం కారణంగా జిల్లాలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ , నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అకాల వర్షాలు తీవ్రం ప్రభావం చూపాయి. దాదాపు 50 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా. కోట్లలో ఆస్తి నష్టం ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నల్లగొండ- నల్లగొండ, సూర్యాపేట్, నకిరేకల్, ఆలేరు, మిర్యాలగూడలో కురిసిన భారీ వర్షంతో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది.
కరీంనగర్- అకాల వర్షం, వడగండ్ల వానతో 20 వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. 13 వేల హెక్టార్లలో వాణిజ్యపంటలు, 7 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పప్పు దినుసు పంటలకుక నష్టం కలిగింది. ఈ వర్షాలకి 50 వేల కోళ్లు మృతి చెందాయి. జగిత్యాల డివిజన్లో రైతులకు అపార నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనా వేయడంలో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా చల్గల్ వద్ద జాతీయ రహదారి పై రైతులు రాస్తారోకోకి దిగారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలకు నష్ట పరిహారం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.