రామప్ప దేవాలయం
‘ప్రత్యేకత’ ఉంటే హెరిటేజ్‌గా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: చార్మినార్, రామప్ప, వేయి స్తంభాల గుడి.. అద్భుత నిర్మాణానికి, కట్టిపడేసే శిల్పకళకు తార్కాణాలు. నాటి నైపుణ్యానికి ప్రతీకలు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఇలాంటి కట్టడాలను భావితరాలకు అందించడం మన కర్తవ్యం. దీని కోసమే భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ), హెరిటేజ్ తెలంగాణ కృషి చేస్తున్నాయి. యునెస్కో గుర్తింపు కోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడం.. ఎర్రమంజిల్ కూల్చివేత నేపథ్యంలో ‘హెరిటేజ్’ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. అసలు హెరిటేజ్ అంటే ఏమిటి?.. ఎలా గుర్తిస్తారు?...
ఏఎస్‌ఐ ఆధీనంలో 8 కట్టడాలే
ప్రస్తుతం తెలంగాణలో ఏఎస్‌ఐ ఆధీనంలో 8 కట్టడాలే ఉన్నాయి. చార్మినార్, గోల్కొండ, రామప్ప, వేయిస్తంభాల గుడి ఇందులో ప్రముఖమైనవి. దేశానికి ప్రాధాన్యాన్ని కల్పించే ప్రాంతం/ కట్టడాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) తన ఆధీనంలోకి తీసుకుంటుంది.
హెరిటేజ్ తెలంగాణలో ప్రస్తుతం 337
హెరిటేజ్ తెలంగాణలో ప్రస్తుతం 337 రక్షిత కట్టడాలు ఉన్నాయి. స్థానిక ప్రాంతానికి ప్రత్యేకతదిగా ఉన్న కట్టడం/ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని రక్షిత కట్టడాల జాబితాలోకి చేరుతుంది. నాటి హుడా ఆధ్వర్యంలో ఏర్పడ్డ హెరిటేజ్ కమిటీ గుర్తించిన కట్టడాలు 137. ఇటీవల వీటిని రక్షిత కట్టడాల జాబితా నుంచి సవరించారు. ఇవి అటు ఏఎస్‌ఐ అధీనంలో, ఇటు హెరిటేజ్ తెలంగాణ అధీనంలో లేవు.
ప్రస్తుతం 3,693
కేంద్ర ప్రభుత్వ అధీనంలో (బ్రిటిష్ కాలంలో) 1861లో ప్రారంభమైన ఏఎస్‌ఐ తొలుత ఢిల్లీలోని 20 చారిత్రక కట్టడాలను రక్షిత కట్టడాలుగా గుర్తించింది. స్వాతంత్రం సిద్ధించే నాటికి వీటి సంఖ్య 151కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ జాబితాలో 3,693 ఉన్నాయి.
వారసత్వ కట్టడాలంటే..
ఒక మానవ కట్టడం, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రాంతం కొన్ని ప్రత్యేక లక్షణాలతో కనీసం వందేళ్లుగా మనుగడ సాగిస్తూ ఉంటే దాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించొచ్చు. చారిత్రకంగా ఆ ప్రాంతానికి ప్రత్యేక లక్షణాలుండాలి. లేదా నిర్మాణ శైలి అసాధారణ విలక్షణతతో కూడుకుని ఉండాలి. ఆ నిర్మాణంలో ప్రత్యేక నైపుణ్యం దాగి ఉండాలి. దాని సౌందర్యం గొప్పగా అనిపించాలి. ఇది భవిష్యత్ తరాలకు చాలా అవసరమైనదై ఉండాలి. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. ప్రకృతి రమణీయతలో విలక్షణం కనపడాలి. అది ఆ ప్రాంత ప్రత్యేకత అని చాటి చెప్పేలా ఉండాలి.... ఇలా ఏదో ఓ అంశాన్ని అది కలిగి ఉంటే దాన్ని వారసత్వ ప్రాంతం కట్టడంగా గుర్తిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment