
దేశ విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ప్రెసిడెంట్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మంగళవారం నగరానికి రానున్న నేపథ్యంలో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అటు మెట్రో రైలు ప్రారంభం..ఇటు ప్రపంచ పారిశ్రామిక సదస్సు నిర్వహణతో సిటీ కొత్త కళ సంతరించుకుంది. మియాపూర్‌లో ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంభిస్తారు. ఇక హైటెక్స్‌లో జరగనున్న జీఈఎస్ సమ్మిట్‌లో ఆయన ఇవాంకా ట్రంప్‌తో కలిసి పాల్గొంటారు. వీరి కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేక విందు సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగరమంతా హై అలర్ట్ ప్రకటించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
సాక్షి, సిటీబ్యూరో: అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల పర్యటన నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ సదస్సు, మెట్రో రైలు ప్రారంభం నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి వెస్టిన్ హోటల్‌కు వెళ్ళడంతో పాటు హెచ్‌ఐసీసీలో జరుగనున్న జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. అక్కడ నుంచి తాజ్ ఫలక్‌నుమాలో విందుకు హాజరవుతారు. ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్‌లో మెట్రో రైలును ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్‌ఐసీసీ, ఆపై తాజ్ ఫలక్‌నుమాలకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి వెళ్ళనున్నారు. ఇవాంక మాత్రం బుధవారం సాయత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఈ మూడు రోజుల్లోనూ మొత్తం మూడు విందులు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విందు తాజ్ ఫలక్‌నుమాలో, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విందు గోల్కొండ కోటలో, అమెరికా ప్రభుత్వం ఇస్తున్న విందు హెచ్‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో జరుగనున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకు పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది.
భద్రత, బందోబస్తు విధుల కోసం వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసుల్ని కేటాయించారు. వీరు మూడు షిఫ్టుల్లోనూ విధులు నిర్వర్తించనున్నారు. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలు, వెస్టిన్ హోటల్, హెచ్‌ఐసీసీ, మియాపూర్, తాజ్ ఫలక్‌నుమా, గోల్కొండ కోటల్లో ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు జీఈఎస్‌కు హాజరయ్యే విదేశీ అతి«థులు బస చేస్తున్న 21 హోటళ్ల వద్దా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులతో పాటు అతిథులు ప్రయాణించే మార్గాల్లోనూ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాష్ట్ర పోలీసులు, నీతి ఆయోగ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఎస్పీజీ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ప్రాంతంలోనూ యాక్సిస్ కంట్రోల్, రోడ్ ఓపెనింగ్, బాంబు నిర్వీర్య తనిఖీలు జరుగుతున్నాయి. హెచ్‌ఐసీసీ–తాజ్ ఫలక్‌నుమా మధ్య ఉన్న రహదారి పరిస్థితులు, ప్యాలెస్ వద్ద పార్కింగ్ సమస్యల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి అతిథుల తరలింపు ప్రారంభిస్తారు.
ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే ప్రధాని, ఇవాంక అక్కడకు చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సదస్సు, ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో వీలున్నంత వరకు సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంలో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ఔటర్ రింగ్ రోడ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్ళింపులు తప్పనిసరి. ప్రధానికి సంబంధించి తాజ్ ఫలక్‌నుమా, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగతా టూర్ మొత్తం హెలీకాప్టర్‌లో జరుగుతుంది. అయినప్పటికీ ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్లే ప్రముఖులూ ఉండనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు కచ్చితంగా తమ వెంట గుర్తింపుకార్డు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవాంక ఇంకెక్కడికి వెళ్లరా?
బుధవారం వరకు హైదరాబాద్‌లోనే ఉండనున్న ఇవాంక షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత కొరవడింది. బస, హెచ్‌ఐసీసీ, తాజ్ ఫలక్‌నుమా ఈ మూడు కార్యక్రమాలు మంగళవారమే జరుగుతున్నాయి. అయితే బుధవారం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల నుంచి పోలీసులకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పోలీసు అధికారులు మాత్రం ఈ అన్ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే కనీసం మూడు, నాలుగు గంటల ముందు తమకు సమాచారం ఇవ్వాలని అమెరికా అధికారుల్ని కోరారు. ఇవాంక వెళ్ళే మార్గం క్లియర్ చెయ్యడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లకు ఈ సమయం పడుతుందని వారు స్పష్టం చేశారు. కాగా ఇవాంక పర్యటన నేపథ్యంలో సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టింది.
ఇంజన్‌బౌలి–చాంద్రాయణగుట్ట మధ్య రోడ్డు క్లోజ్
తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మంగళవారం రాత్రి విందు నేపథ్యంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం. వీటిలో భాగంగా ఇంజన్‌బౌలి–చంద్రాయణగుట్ట చౌరస్తా మధ్య మార్గాన్ని సాధారణ వాహనాలకు పూర్తిగా మూసేస్తున్నాం. ఐఎస్ సదన్, డీఎంఆర్‌ఎల్ వైపు నుంచి చాంద్రాయణగుట్ట వైపు వచ్చే వాహనాలను మిదానీ జంక్షన్ నుంచి బాలాపూర్ వైపు మళ్ళిస్తాం. శ్రీశైలం హైవే మీదుగా వచ్చే వాహనాలను కేశవగిరి పోస్టాఫీస్ నుంచి బాలాపూర్ వైపు పంపిస్తాం. హిమ్మత్‌పుర నుంచి ఫలక్‌నుమా వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాగుల్‌చింత టి జంక్షన్ వద్ద లాల్‌దర్వాజా వైపు మళ్ళిస్తాం. కాలాపత్తర్/జహనుమ వైపుల నుంచి షంషీర్‌గంజ్ టి జంక్షన్ వైపు వచ్చే వాహనాలను గోశాల జహనుమ వైపు పంపిస్తాం. జహనుమ, బీబీకా చష్మా వైపు నుంచి ఫలక్‌నుమా వైపు వచ్చే వాహనాలను షంషీర్‌గంజ్ వైపు పంపిస్తారు. – వీవీ శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్ సీపీ
ఎస్పీజీ ఆధీనంలోనే ప్యాలెస్
తాజ్ ఫలక్‌నుమా ప్యాలస్ మొత్తం ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఆధీనంలో ఉంటుంది. ప్యాలెస్‌లోకి ఇవాంక కాన్వాయ్‌లో ఐదు వాహనాలు, ప్రధాని కాన్వాయ్‌లో మూడు వాహనాలు అనుమతిస్తున్నారు. అయితే ఒక్కో వాహనం మాత్రమే పైన ఉండి మిగిలినవి కింద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లోకి వచ్చేస్తాయి. ఈ పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో వ్యాపారులపై ఎలాంటి ఆంక్షలు విధించట్లేదు. కేవలం రహదారికి అడ్డంగా ఉన్న కొందరు చిరు వ్యాపారులను మాత్రమే తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలిస్తున్నాం. ఆరాంఘర్ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ మధ్య మార్గంలో మొత్తం 30 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. వాటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. మంగళవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10.30 గంటల వరకు ప్రధాన రహదారిపైకి ఎలాంటి వాహనాలు అనుమతించవద్దని వాటిలో స్పష్టం చేశాం. దీనికి అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు సైతం చేస్తున్నాం. – వి.సత్యనారాయణ, సౌత్‌జోన్ డీసీపీ
Comments
Please login to add a commentAdd a comment