జిల్లాల ప్రక్రియ నిలుపుదలకు నో: హైకోర్టు
తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను దసరా సెలవుల తరువాతకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంతాలైన ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని మండలాలతో కొత్త జిల్లాల ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల సంబంధిత నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
ఇదే అభ్యర్థనతో ఖమ్మం జిల్లాకు చెందిన రమణల లక్ష్మయ్య మరో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గురువారం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. శ్రీనివాస్ తరఫు న్యాయవాది జె.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాల విభజన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉండవని, గవర్నర్‌కు మాత్రమే అధికారాలు ఉంటాయన్నారు. గవర్నర్ సైతం గిరిజన సలహా మండలి సిఫారసుల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయలేదని, ఈ మండలి లేకుండా గిరిజన ప్రాంతాల విభజనపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నింటినీ గవర్నర్ ద్వారానే వినియోగించాల్సి ఉందని వివరించారు. షెడ్యూల్ ప్రాంతాల సరిహద్దులను మార్చే విషయంలో అధికారాలన్నీ రాష్ట్రపతివేనని, గవర్నర్‌ను సంప్రదించిన తరువాతే రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. లక్ష్మయ్య తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. గిరిజన ప్రాంతాల సాధికారత, తెగల రక్షణ, సంక్షేమం కోసం రాజ్యాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు సుప్రీంకోర్టు తీర్పుల గురించి ప్రస్తావించారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, అసలు ప్రభుత్వ చర్యలు అధికరణ 14కు ఎలా విరుద్ధమవుతాయో చెప్పాలని ప్రభాకర్‌ను కోరింది. అయితే ఆయన సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఆ తర్వాత కూడా పలు ప్రశ్నలు సంధించగా, వాటికి కూడా ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. దీంతో ధర్మాసనం గిరిజన ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ నిలుపుదలకు నిరాకరించింది.