తీర్పునకు లోబడే అక్కడ కొత్త జిల్లాలు
కరీంనగర్‌లో ఏర్పడే జిల్లాలపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 22న జారీ చేసిన జీవో 362, ఫాం 1 నోటిఫికేషన్ల ఆధారంగా కరీంనగర్‌లో జరిగే కొత్త జిల్లాల ఏర్పాటు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో జారీ అయ్యే తుది నోటిఫికేషన్ కూడా కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌం టర్ దాఖలు చేయాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖరరెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని, అందుకు అనుగుణంగానే జీవో 362, ఫాం 1 నోటిఫికేషన్‌లను జారీ చేసిందని, వీటి అమలులో ముందుకెళ్లకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన న్యాయవాది ఎ.రమాకాంతరావు, ఇల్లంతకుంట మండలానికి చెందిన సీహెచ్ గంగాధర్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, తెలంగాణ జిల్లాల (ఏర్పా టు) నిబంధనలు-1984 ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ముందు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి, ప్రజల నుంచి సలహాలు, అభ్యం తరాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు.
అయితే ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే కొత్త జిల్లాల ఏర్పాటులో ముందుకు వెళ్తోందని కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) మహేందర్‌రెడ్డి స్పందిస్తూ, కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, జీవో 362, ఫాం 1 నోటిఫికేషన్ల ఆధారంగా కరీంనగర్‌లో జరిగే కొత్త జిల్లాల ఏర్పాటు.. తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుం దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.