రక్షిత గృహాలెన్ని? సామర్థ్యమెంత?
ఇరు ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: లైంగిక దాడులకు గురైన మహిళల రక్షణ కోసం ఏర్పాటైన రక్షిత గృహాలు (రెస్క్యూ హోమ్స్) ఎన్ని ఉన్నాయి. వాటిలో ఉన్న సౌకర్యాలు.. వాటి సామర్థ్యం తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ వివరాలను పరిశీలించిన తరువాత వసతి గృహాల పరిశీలన కోసం కమిటీలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. లైంగిక దాడులకు గురైన మహిళల రక్షణ కోసం రక్షిత గృహాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేసింది.