
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు కూడా వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడా 42 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంలేదు. బుధవారం నల్లగొండ, ఖమ్మంల్లో ఏకంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనం విలవిల్లాడిపోతున్నారు. మరోవైపు ఉత్తర ఇంటీరియర్ ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు. కానీ దానివల్ల రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం ఉండదని, పొడి వాతావరణం నెలకొని ఉంటుందని తెలిపారు.
మంథని@47
పెద్దపల్లి జిల్లాలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజురోజుకు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మంథనిలో 46.1 గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, బుధవారం రికార్డు స్థాయిలో 47 డిగ్రీలు నమోదైంది. దీంతో జనం విలవిల్లాడారు. ఉదయం 9 గంటలకు మొదలైన భానుడి ప్రతాపం రాత్రి 10 గంటలు దాటినా వేడి తగ్గలేదు. దీంతో చాలా మంది ఇళ్లకే పరిమితయ్యారు.
వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
నల్లగొండ 45.0
ఖమ్మం 44.8
ఆదిలాబాద్ 44.3
రామగుండం 44.0
నిజామాబాద్ 43.6
మహబూబ్‌నగర్ 43.5
మెదక్ 42.6
హైదరాబాద్ 42.1
హన్మకొండ 42.0