
సాక్షి, కరీంనగర్: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కరీంనగర్‌లో హై టెన్షన్ కొనసాగుతుంది. జిల్లాలో పర్యటించిన ఇండోనేషియాకు చెందిన పది మంది మతప్రచారకులతో పాటు నగరానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమయింది. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇండోనేషియా బృందం పర్యటించిన ప్రాంతాలను గత పది రోజులుగా దిగ్బంధం చేసి, ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. బుధవారం ఆ ప్రాంతంలో వైద్య బృందాలతో ర్యాపిడ్ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా కరోనా లక్షణాలు ఎవ్వరికీ లేకపోవడంతో ఇతర ప్రాంతాల వారి మాదిరిగా వారికి కాస్త వెసులుబాటు ఇచ్చారు. (మరో వారం రోజులు కీలకం..)
గురువారం ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులు రోడ్లపైకి, మార్కెట్‌కు రావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే డేంజర్ జోన్ పరిధిలోని దారులన్నీ బారిగేడ్స్‌తో మూసివేసి పోలీస్ పహారా ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మరో రెండు మూడు వారాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన 57 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. గురువారం ఉదయం నాటికి తెలంగాణలో 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా బారినా పడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి.