సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సంస్థలు ఒక్కోటిగా మూతబడుతున్న తరుణంలో తొలిసారి ఓ అనుబంధ సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు సంస్థ చైర్మన్ ప్రయత్నిస్తుంటే.. కొందరు అధికారులు మాత్రం అందుకు మోకాలడ్డుతున్నారు. ఆర్టీసీలో అతిపెద్ద అనుబంధ సంస్థ బస్‌బాడీ యూనిట్ ప్రొడక్షన్‌ను భారీగా పెంచి లాభాల బాట పట్టించే చైర్మన్ ప్రయత్నాలకు అడ్డుతగులుతున్నారు. నష్టాల పేరుతో ఆర్టీసీ ఆస్పత్రి ఫార్మసీ, టైర్ రీ ట్రేడింగ్ యూనిట్, ప్రింటింగ్ ప్రెస్ ఇప్పటికే ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లగా.. అదేదారిలో బస్‌బాడీ యూనిట్‌నూ పాడుబెట్టి ప్రైవేటీకరించేందుకు తెరవెనుక యంత్రాంగం నడుపుతున్నారు.
నష్టాలు చూపి ప్రైవేట్‌కు..
ఆర్టీసీకి మియాపూర్‌లో భారీ బస్‌బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. సంస్థ కొనే బస్సులకు బాడీలు రూపొందించుకోడానికి దీన్ని సమకూర్చుకుంది. కంపెనీల నుంచి చాసీస్‌లు మాత్రమే కొనగోలు చేసి ఈ యూనిట్‌లో బాడీలు రూపొందిస్తారు. అయితే బస్సుల సంఖ్య పెరగడంతో యూనిట్ సామర్థ్యం సరిపోక కొన్ని బస్సుల బాడీలు రూపొందించే పనిని ప్రైవేట్‌కు ఇవ్వడం ప్రారంభించారు. క్రమంగా నష్టాల బూచి చూపి.. మొత్తం పనులూ ప్రైవేట్‌కు ఇచ్చే దిశగా ఏర్పాట్లు జరిగాయి.
ప్రైవేట్ సంస్థకు ‘అడ్డుగోడల’పని
మహిళా ప్రయాణికుల భద్రతలో భాగంగా గతంలో సిటీ బస్సుల్లో మధ్యలో అల్యూమినియం షీట్‌తో అడ్డుగోడలు ఏర్పాటు చేశారు. ఈ పని చేసేందుకు అన్ని డిపోల్లో వ్యవస్థ ఉన్నా ఆర్టీసీ మాత్రం ప్రైవేట్ సంస్థలకు అప్పగించి రూ.4.5 కోట్లు చెల్లించింది. తాజాగా ఆర్టీసీ కొనుగోలు చేసిన చాసీస్‌లకు బాడీలు రూపొందించే పని కూడా క్రమంగా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకే వెళ్తొంది. అలాగే బస్సులు రూపొందించే బడా ప్రైవేట్ సంస్థలకు దీటుగా ఆర్టీసీకి సొంత బస్‌బాడీ యూనిట్ ఉన్నా దాన్ని నష్టాల పాలుజేసి మూసేసే ప్రయత్నం జరిగింది.
లాభాలు సాధ్యమే..
గతేడాది చివరలో బస్‌బాడీ యూనిట్ కార్యకలాపాలు పర్యవేక్షించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ.. అందులోని సిబ్బందితో సమావేశమై సంస్థ బలోపేతం అవకాశాలపై ఆరా తీశారు. లాభాల బాట పట్టించటం సాధ్యమేనని తేలడంతో.. యూనిట్ నుంచి ఇతర విభాగాలకు బదిలీ అయిన సిబ్బందిని తీసుకొచ్చి ప్రొడక్షన్ పెంచే పనులు ప్రారంభించారు. అయితే ఇది నచ్చని కొందరు అధికారులు.. ఆ చర్యలు పూర్తిస్థాయిలో అమలవకుండా అడ్డుకుంటున్నారని విమర్శలున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే భారీ మార్పులు కనిపించాల్సి ఉన్నా పూర్తి ఫలితాలు రాలేదు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన చైర్మన్.. ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు విషయాన్ని సీఎం వరకు తీసుకెళ్లేందుకైనా వెనుకాడబోనని తేల్చి చెప్పారు.
బ్రేక్ ఈవెన్‌కు చేరువలో..
ప్రస్తుతం బస్‌బాడీ బిల్డింగ్ యూనిట్ లో 198 మంది కార్మికులు పని చేస్తున్నారు. మరో 40 మంది పర్యవేక్షణాధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు నెలకు 18 బస్ బాడీలే రూపొందిస్తుండటంతో సిబ్బంది వేతనాల్లో 60% నష్టాల ఖాతాల్లోకి చేరుతున్నట్లు గుర్తించారు. ప్రతినెలా 35కు పైబడి బస్సులకు బాడీ రూపొం దించగలిగితే యూనిట్ బ్రేక్ ఈవన్‌కు వస్తుందని తెలుసుకుని ఆ మేరకు చర్యలు ప్రారంభించారు. తాజాగా నెలకు 28 బస్సు బాడీలు రూపొందించే స్థాయికి చేరుకోగా.. మరో నెలలో 30కి, తర్వాత 35కు తీసుకొచ్చేలా కసరత్తు ప్రారంభించారు. ఈ ఏడాది చివరి నాటికి 45కు చేరితే భారీ లాభాలొస్తాయని చైర్మన్ పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment