ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 17 రోజులు దాటుతున్నా విముక్తి లభించలేదు. వారిని చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మొదట డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి తెచ్చిన యంత్రం చెడిపోయింది. ఇప్పుడు ప్రతికూల వాతావరణం కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది.
ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను చేరుకోవడానికి అమెరికన్ ఆగర్ మెషిన్ చెడిపోవడంతో ప్రస్తుతం మాన్యువల్ డ్రిల్లింగ్ జరుగుతోంది. 86 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 36 మీటర్ల మేరకు తవ్వగలిగారు. అమెరికా నుంచి తీసుకువచ్చిన డ్రిల్లింగ్ మిషన్ బ్లేడ్లు.. బాధిత కార్మికులున్న ప్రదేశానికి 12 మీటర్ల ముందుగానే విరిగిపోయాయి. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపివేసి, బ్లేడ్‌లను తొలగించాల్సివచ్చింది.
ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ ఆపరేషన్‌కు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని వల్ల రెస్క్యూకు సమస్యలు తలెత్తవచ్చని అధికారులు భావిస్తున్నారు. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్‌ఎస్ సంధు సంఘటనా స్థలానికి వచ్చారు.
సొరంగంలో వర్టికల్ డ్రిల్లింగ్ శరవేగంగా జరుగుతోందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ తెలిపారు. ఇప్పటి వరకు 36 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేశారు. కార్మికులలో నిరాశానిస్పృహలు నెలకొన్న దృష్ట్యా, ఐదుగురు వైద్యుల బృందం సంఘటనా స్థలంలో ఉంటోంది. వారు సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నామని, వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేలా చూస్తున్నామని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ తెలిపారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు త్వరగా బయటకు రావాలని కాంక్షిస్తూ స్థానికులు సొరంగం దగ్గర హోమాలు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం!
Comments
Please login to add a commentAdd a comment