కేసీఆర్ పదేళ్ల కల.. | hopes on new railway line | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పదేళ్ల కల..

Published Tue, Jul 8 2014 12:19 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

కేసీఆర్ పదేళ్ల కల.. - Sakshi

కేసీఆర్ పదేళ్ల కల..

సిద్దిపేట: సీఎం కేసీఆర్ పదేళ్ల కల.. ఆయన స్వయంగా రూపకల్పన చేసిన రైల్వే ప్రాజెక్టు అది. సీఎం కృషితోనైనా రైలు చూడాలన్న తమ కల నెరవేరాలని సిద్దిపేట ప్రజలు  ఎదురుచూస్తున్నారు. కేంద్రమంత్రి హోదాలో కేసీఆర్ రూపకల్పన చేసిన మనోహరాబాద్-సిద్దిపేట-కొత్తపల్లి రైల్వేలైన్‌కు ‘మోడీ’ ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందని ఆశ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రైల్వేబడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రైలుమార్గంపై ప్రజల ఆశలు మళ్లీ  చిగురించాయి.

'మెదక్ ఎంపీ వెంకటస్వామి మొదలు విజయశాంతి వరకు సిద్దిపేటకు రైలుమార్గం తీసుకువస్తామని హామీలు ఇచ్చినా కార్యాచరణ కు నోచుకోలేదు. ఎంపీలు కొంత ప్రయత్నం చేసినా, వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 2004లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సిద్దిపేటకు రైలు తీసుకువచ్చేందుకు మనోహరాబాద్-సిద్దిపేట-కొత్తపల్లి రైల్వేలైన్‌ను ప్రతిపాదించారు. యూపీఏ ప్రభుత్వం ఈ మార్గానికి 2007లో పచ్చజెండా ఊపింది. రైల్వేలైన్ సర్వే పనులు చేపట్టేందుకు రూ.4 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే సర్వే పనులు ప్రారంభానికి నోచుకోలేదు. అప్పటికే టీఆర్‌ఎస్ యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలగటంతో ఈ ప్రాజెక్టు మరుగునపడింది.
 
కాగా తిరిగి కేసీఆర్ వత్తిడితో కేంద్రం మరోమారు మనోహరాబాద్-సిద్దిపేట-పెద్దపల్లి రైలుమార్గం తాత్కాలిక సర్వే పనుల కోసం రూ.40 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే సకాలంలో సర్వే పనులు పూర్తి చేయకపోవటంతో నిధులు వెనక్కిమళ్లి మరోమారు సిద్దిపేట ప్రజల ఆశలు అడుగంటినట్లైంది. కాగా 2009లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నూతన రైలుమార్గాల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే కేంద్రం ప్రతిపాదనలు, షరతులు సిద్దిపేట రైలుమార్గానికి అవరోధంగా మారాయి. భూసేకరణ, నూతన రైల్వేమార్గం ఏర్పాటులో 50 శాతం వ్యయం, ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఐదేళ్లపాటు రైలుమార్గంలో చోటు చేసుకునే నష్టం భరించాల్సిందిగా కేంద్రం నిబంధనలు విధించింది. కఠినమైన ఈ నిబంధనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఈ నూతన రైలుమార్గంపై మౌనం వహించింది.  
 
నూతన రాష్ట్రంలో రైలుమార్గంపై కోటి ఆశలు
తెలంగాణ రాష్ర్టం సిద్ధించటం.. సిద్దిపేట బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి కావటంతో సిద్దిపేట ప్రజలు మరోమారు రైలుమార్గం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ సైతం తన కలల ప్రాజెక్టు మనోహరాబాద్-సిద్దిపేట-కొత్తపల్లి రైల్వేలైన్ కోసం వత్తిడి ప్రారంభించారు. ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్ ఎంపీల సమావేశంలోనూ ఈ రైలుమార్గం కోసం పార్లమెంట్‌లో పట్టుబట్టాలని ఎంపీలకు సూచించారు. దీంతో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్ కోసం సిద్దిపేట ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం నిధులు విడుదల చేయటంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు హామీ ఇచ్చిన పక్షంలో సిద్దిపేట ప్రజల కల సాకారమయ్యే అవకాశం ఉంది. సిద్దిపేటకు రైలుమార్గం ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
 
 
 జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంత ప్రయాణికులకు ప్రతి రైల్వే బడ్డెట్‌లోనూ నిరాశే ఎదురవుతోంది. ఈ బడ్డెట్‌లోనైనా మోక్షం కలుగుతుందేమోనని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. రైల్వే పెండింగ్ పనులను పూర్తి చేయించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా జహీరాబాద్ రైల్వేస్టేషన్‌లో అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో ప్లాట్ ఫాం, పుట్ ఓవర్ బిడ్జి తదితర పనుల జాప్యంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రైల్వే అధికారులు స్పందించి రెండో ప్లాట్ ఫాంను నిర్మించి ఇబ్బందులు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
 
 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక తప్పని తిప్పలు
 ఫుట్ ఓవర్‌బ్రిడ్జి లేని కారణంగా ప్రయాణికులు ఉత్తరం వైపున ఉన్న రైల్వే ద్వారం నుంచే బయటకు వెళ్లాల్సి వస్తోంది. దక్షిణం వైపున వెళ్లే ప్రయాణికులు చుట్టూ తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేని కారణంగా ప్రయాణికులు రైల్వే ట్రాక్‌ను దాటుకుంటూ మొదటి ప్లాట్‌ఫాం పైకి ఎక్కాల్సి వస్తోంది.
 
 కొత్త రైళ్ల కోసం ఎదురు చూపు
 ఈ బడ్జెట్‌లో కొత్తగా రైళ్లను మంజూరు చేస్తుందేమోనని ప్రయాణికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్-బీదర్‌ల మధ్య కొత్తగా రెండో ఇంటర్‌సిటీ రైలు కావాలని కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి బీదర్ వైపు వెళ్లేందుకు ఉదయం పూట ఒక్క రైలు సదుపాయం కూడా లేదు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా ముంబాయికి రైలును మంజూరు చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
 
 రైల్వే విచారణ కౌంటర్ అవసరం
 ప్రస్తుతం జహీరాబాద్ రైల్వే స్టేషన్‌లో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు అవకాశం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే విచారణ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
 
 ప్రతిపాదనలకు నోచుకోని డబుల్ లైన్
 జహీరాబాద్‌కు డబుల్ రైల్వేలైన్‌ను మంజూరు చేసే విషయంలో రైల్వే శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ నుంచి కర్ణాటకలోని బీదర్ వరకు డబుల్ లైన్ నిర్మించాల్సి ఉంది. వికారాబాద్-బీదర్‌ల మధ్య కేవలం వంద కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మేరకు డబుల్‌లైన్‌ను ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు రైళ్ల రాక పోకలు సాగించేందుకు ఇబ్బందులు ఉండవని ప్రయాణికులు పేర్కొంటున్నారు. డబుల్‌లైన్‌తో పాటు ఎలక్ట్రిక్ రైళ్లు నడిచేందుకు వీలుగా కూడా నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
 
మెదక్: అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు మూడడుగులు ముందుకు...ఆరడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. రైల్వేలైన్ మంజూరు కోసం కేంద్రం పచ్చజెండా ఊపి తనవంతు వాటాగా మొదట రూ.25కోట్లు మంజూరు చేసింది. అయితే రాష్ర్ట ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. భూ సేకరణ ప్రక్రియ సైతం నత్తనడకన నడుస్తోంది. నేటి రైల్వే బడ్జెట్‌లో కేంద్రం తనవంతు మిగతా బడ్జెట్‌ను మంజూరు చేయాలని రైల్వే సాధన సమితి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక పోరాటాల ఫలితంగా అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్‌కు  నిర్మాణం కోసం అవసరమైన రూ.129 కోట్ల వ్యయంలో 50 శాతం వాటా భరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో అంగీకారం తెలిపారు.
 
దీంతో 2010 రైల్వే బడ్జెట్‌లో కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద కొత్త రైల్వేలైన్ల జాబితాలో మెదక్ -అక్కన్నపేట లైన్‌కు చోటుదక్కింది. 2012 రైల్వే బడ్జెట్‌లో మెదక్ రైల్వే లైన్‌కు పచ్చజెండా లభించింది. ఈ మేరకు రైల్వే శాఖ నుండి రూ 1 కోటి, రాష్ట్ర ప్రభుత్వం రూ1 కోటి, ఎంపీ విజయశాంతి తన కోటా నుండి రూ.1 కోటి, 2013 బడ్జెట్‌లో రూ 1.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రైల్వే లైన్ సర్వే, భూవివరాల సేకరణ, రైల్వే స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఇందుకు 80 గ్రామాల పరిధిలోని 131.14 హెక్టార్ల భూమితో పాటు, అటవీ శాఖకు చెందిన 66 హెక్టార్ల భూమి అవసరమవుతుందని అధికారులు తేల్చారు. ఎట్టకేలకు 2014 జనవరి 19న అప్పటి  మెదక్ ఎంపీ విజయశాంతి, మంత్రి సునీతారెడ్డిల చేతుల మీదుగా రైల్వేలైన్‌కు శంకుస్థాపన జరిగింది.
 
అనంతరం ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం రైల్వేలైన్ కోసం తనవంతు వాటాగా రూ.25కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను ఎన్‌సీఆర్ కన్‌స్ట్రక్షన్ విభాగానికి పంపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మిగతా నిధులు మంజూరు కావాల్సి ఉంది. భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ, రైల్వే అధికారుల ఉమ్మడి సారథ్యంలో సర్వే పూర్తయ్యింది. ఈ మేరకు సర్వే రిపోర్టులను, సర్వే ల్యాండ్స్ అండ్ రెవెన్యూ అసిస్టెంట్ డెరైక్టర్‌కు పంపుతూ... సబ్‌డివిజన్ రికార్డులను తమకు అందజేయాలని కోరారు. కాని ఇంత వరకు అలాంటి రికార్డులు తయారు కాలేనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement