నేరడిగొండ : ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరును, సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చే మండల విద్యాధికారుల నియామకంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య గాడి తప్పుతోంది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 52 మండలాలకు గానూ కేవలం మూడు మండలాల్లోనే రెగ్యులర్ విద్యాధికారులు ఉన్నారు. దీంతో మిగతా 49 మండలాల్లో ఇన్‌చార్జీలే విద్యాధికారులుగా కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్‌లో పనిచేసే సీనియర్ ప్రధానోపాధ్యాయులైన పీజీ హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎంఈవోల నియామకంపై దృష్టి సారించకపోవడంతో ప్రాథమిక విద్య అటకెక్కింది. 49 ఇన్‌చార్జీలే. కెరమెరి, బెజ్జూర్, తిర్యాణి మినహా 49 మండలాలకు ఇన్‌చార్జీలే ఎంఈవోలుగా ఉన్నారు.
వీరి ఆధ్వర్యంలో విద్యా పథకాల అమలు, పాఠశాలల పర్యవేక్షణ జరుగుతోంది. సీనియర్ ఉపాధ్యాయులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో పనిభారంతో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు పాఠశాలలపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాఠశాలలో బోధన సక్రమంగా జరగక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా ఆయా పాఠశాలల్లో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు బాధ్యతలు చేపట్టడంతో అక్కడే పాఠశాలల్లోని విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది.
ఇన్‌చార్జి ఎంఈవోల పాలనను ఆసరాగా చేసుకొని కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు ఆలస్యంగా వస్తూ ముందు వెళ్లిపోవడం జరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారైతే ఆసలు పాఠశాలలకే వెళ్లడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యం
ఇన్‌చార్జి ఎంఈవోల వ్యవస్థను ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫీజుల వివరాలు తెలిపే పట్టికను పాఠశాలల్లో ప్రదర్శించడం లేదు. జిల్లాలోని అనేక పాఠశాలకు అనుమతులు కూడా లేవనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరికొన్నింటిలో కనీస వసతలు, ఆట స్థలాలు, తదితర నిబంధనలు పాటించకుండానే పాఠశాలలు నిర్వహిస్తున్న ఇన్‌చార్జి ఎంఈవోలు చూసీ చూడనట్లు ‘మామూలు’గా వ్యవహరిస్తూనే విమర్శలున్నాయి.
ఎన్నాళ్లీ ఇన్‌చార్జి ఎంఈవో వ్యవస్థ
Published Mon, Sep 8 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement