అసెంబ్లీలో అడుగు పెట్టేదెలా?
సస్పెండైన టీ టీడీపీ ఎమ్మెల్యేల విఫలయత్నాలు
రాష్ట్రపతిని కలిసినా లభించని ప్రయోజనం
{పజలు మరచిపోతారని ఎమ్మెల్యేల్లో నిర్వేదం
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు శాసనసభ నుంచి సస్పెండైన టీ-టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సభలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. తమను సభలోకి అనుమతించాలని స్పీకర్ మధుసూదనాచారిని, గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఒక్కసారి కాదు వంద సార్లు క్షమాపణ చెబుతామన్నా స్పీకర్ స్పందించలేదు. దీంతో టీడీపీ నేతలు ఏకంగా రాష్ట్రపతి వద్దకే వెళ్లి మొరపెట్టుకున్నారు. అసెంబ్లీ గొడవను చెప్పకుండా... పార్టీ ఫిరాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, తమ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వడాన్ని ప్రశ్నించినందుకు సభ నుంచి సస్పెండ్ చేశారని ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ద్వారా స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యారు.
ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడి స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడంతో... ఆ దిశగా వెళ్లాలని టీడీపీ ఎమ్మెల్యేలు గురువార ం నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు అనుమతి తీసుకొని టీడీపీ నేతలు ప్రతిపక్ష నేత జానారెడ్డితో చర్చించారు. కానీ దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో సొంతంగానే అవిశ్వాసంపై ముందుకెళ్లాలని భావించారు. ‘శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నాం..’ అని మీడియాకు లీకులు ఇచ్చారు. తీరా అసెంబ్లీ నిబంధనలను పరిశీలించిచూడగా.. టీడీపీకి అది సాధ్యం కాదని తేలడంతో తెల్లబోయారు.
50 మంది మద్దతు అవసరం: 10 శాతం సభ్యుల మద్దతు ఉంటే స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టవచ్చని తొలుత టీడీపీ సభ్యులు భావించారు. అయితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకే ఈ 10 శాతం నిబంధన. అదే సభాపతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో 50 మంది సభ్యుల సంతకం అవసరం. ప్రత్యేకంగా రాష్ట్రాల గురించి అందులో వివరించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 మంది సభ్యులున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ నియమావళిలో పార్లమెంట్ నిబంధననే పొందుపరిచారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటైనా.. ప్రత్యేకంగా తెలంగాణ శాసనసభ నియమావళి రూపొందలేదు. దాంతో అదే 50 మంది సభ్యుల నిబంధనే అమలవుతోంది. అయితే టీడీపీకి సాంకేతికంగా ఉన్న సభ్యులు 15 మంది. కానీ అందులో టీఆర్‌ఎస్‌లో చేరిన వారిని మినహాయిస్తే మిగిలేది 12 మందే. ఈ సంఖ్యతో స్పీకర్‌పై అవిశ్వాసం సాధ్యం కాదని తేలడంతో.. అవిశ్వాస తీర్మానం ప్రభుత్వంపైనే పెట్టాలని భావిస్తున్నామని, దీనిపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు.
ఎమ్మెల్యేల్లో నిర్వేదం: బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడే అవకాశం రాకపోవడం, సభలో టీడీపీ ప్రాతినిథ్యం లేదన్నట్లుగా అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు పార్టీ సభ్యులకు మింగుడు పడడం లేదు. శుక్రవారం ఇతర పార్టీల నేతలు సభలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరినా... స్పీకర్ నుంచి పరిశీలిస్తామనే తప్ప మరెలాంటి హామీ రాలేదు. దీంతో ఈ సమావేశాల వరకు ఇంతేనా.. అసెంబ్లీలో అడుగుపెట్టేదెలా..? అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనలో మునిగిపోయారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో వారం పాటు సస్పెన్షన్‌లో ఉన్న తాము.. ఈసారి అసలే కనిపించకుండా పోతే ప్రజలు మరచిపోతారేమోనని ఆవేదన చెందుతున్నారు.