పురపాలక శాఖలో ప్రాధాన్యత పోస్టులకు భారీ గిరాకీ
ఏఈ పోస్టుకు రూ. 3 లక్షలు,
డీఈ పోస్టుకు రూ. 5 లక్షలు ‘ధర’
హైదరాబాద్: సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో పురపాలకశాఖలో ప్రాధాన్యత పోస్టులకు భారీ గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్‌లు.. ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఏఈకి రూ. 3 లక్షలు, డీఈకి రూ. 5 లక్షలు ధర పలుకుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని కమిషనరేట్ ఉన్న ఈఎన్‌సీ చుట్టూ ఏఈలు, డీఈలు చక్కర్లు కొడుతున్నారు. వివిధ జిల్లాల్లో కొత్త పురపాలకశాఖకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో ఏఈలు, డీఈలు ఇలా భారీగా ముడుపులు చెల్లించి ప్రాధాన్యం ఉన్న విభాగానికి బదిలీ చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నెల్లూరులో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు వచ్చింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి ప్రాజెక్టు ఉంది. దీంతో పాటు విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లలో కేంద్ర పథకాలు వచ్చాయి. దీంతో ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన కీలక పోస్టులకు బదిలీల కోసం ఈఎన్‌సీని ప్రసన్నం చేసుకునేందుకు ఏఈలు, డీఈలు భారీగా ముడుపులు ఇచ్చేం దుకు సిద్ధమయ్యారు. గుంటూరు సీఈ పోస్టు ఖాళీగా ఉన్నా ఎస్‌ఈ కోసం ఈఎన్‌సీ ఈ పోస్టును భర్తీ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మనవాడు కాకపోతే తప్పించండి!
ఆ సీటులో ఉన్నది టీడీపీ అనుకూల అధికారా? కాదా? అనేదొక్కటే చూడాలని, పార్టీకి అనుకూలం కాకపోతే ఆ సీటులోకొచ్చి ఒక్కరోజైనా సరే లేపెయ్యాల్సిందేనని మునిసిపల్ మంత్రి నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. ప్రత్యేకంగా సచివాలయంలో అధికారుల సమక్షంలోనే మంత్రి ఈ మాటలన్నట్టు ఓ అధికారి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎవరినైనా బదిలీ చేసి ఉంటే మినహా మిగతా వాళ్లందరినీ బదిలీ చేయాలని మౌఖిక ఆదేశాలందాయి. టీడీపీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహకరించట్లేదని తెలిసినా కూడా వారిని అప్రధాన్య పోస్టుకు బదిలీ చేయాలని మంత్రి సూచించినట్టు తెలిసింది.
ఎమ్మెల్యేల నుంచీ సిఫారసులు...
కార్పొరేషన్లలో కీలకమైన పోస్టుల్లో తమకు సహకరించే అధికారులను వేయించుకోవాలని మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలూ పైరవీ మొదలుపెట్టారు. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని ఓ సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే నుంచే 35 సిఫారసు లేఖలు వచ్చినట్టు తెలిసింది. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ల పరిధిలోనూ టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పురపాలక శాఖకు భారీగా సిఫారసు లేఖలు ఇచ్చారు. దీంతో పురపాలక శాఖ ఇంజనీరింగ్ విభాగంలో బదిలీల జాతర మొదలైంది. ఉన్నతాధికారులైతే సిఫారసు లేఖలు చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో బదిలీల ‘జాతర’
Published Mon, Aug 25 2014 12:55 AM | Last Updated on Tue, Oct 30 2018 5:20 PM
Advertisement
Advertisement