
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సదస్సు నిర్వహణతో హైదరాబాద్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగనుంది. దేశ విదేశాల పారిశ్రామికవేత్తలు, అంకుర పరిశ్రమల అధినేతలు హాజరవుతున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో.. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులైన సుమారు 72 మంది ప్రసంగించనున్నారు. అందులో హైదరాబాద్‌తో ప్రత్యక్ష, పరోక్ష అనుబంధమున్న ఆరుగురు ప్రముఖులు కూడా ఉన్నారు. వీరిలో శశిశేఖర్ వెంపాటి, అనురాధా ఆచార్య, జయదీప్ కృష్ణన్, రమణ గోగుల, కొండా సంగీతారెడ్డి, టెస్సీ థామస్‌లు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. వారి నేపథ్యాన్ని పరిశీలిస్తే..
జయదీప్ కృష్ణన్.. టీ–హబ్ సీఈవో
దేశంలో అంకుర పరిశ్రమలకు అతిపెద్ద ఇంక్యూబేటర్‌గా పేరొందిన టీ–హబ్ సీఈవోగా జయదీప్ కృష్ణన్ పనిచేస్తున్నారు. గత 20 ఏళ్లుగా మన దేశంతో పాటు అమెరికాలో సంయుక్తంగా విస్తరించిన వ్యవస్థాపక, కార్పొరేట్ రంగాల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. తన కెరీర్ ప్రారంభంలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న ఓ టెక్నాలజీ సంస్థ విఫలమైంది. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని అంచలంచెలుగా ఎదిగారు. అల్మామేటర్ ఇంక్యుబేషన్ సెంట్రల్ సంస్థ నుంచి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (బెంగుళూరు)లో ఒక ఇండస్ట్రియల్ రాడిఫైనిటీ అనే సాంకేతికతను నిర్వహించే స్థాయికి ఎదిగారు. 2010లో టెలికం స్పేస్ రంగంలో బ్రూక్‌ట్రాట్ టెక్నాలజీ అనే అంశంపై పరిశోధక ఇంజనీర్‌గా సేవలందించారు. అనేక అంకుర పరిశ్రమలను స్థాపించి వేలాది మందికి ఉపాధి చూపారు. అనేక అంతర్జాతీయ స్థాయి అవార్డులు ఆయనను వరించాయి. ఇందులో క్లీన్‌టెక్ ఓపెన్, ఐసీఎస్పీఏటీ, టెక్ కనెక్ట్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కూడా ఉన్నాయి. తొలుత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ఆయన తర్వాత ప్రతిష్టాత్మక హార్వర్డ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (బెంగళూరు)లలో పలు కోర్సులు చేశారు.
రమణ గోగుల.. క్లీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్
సౌరశక్తి ఆధారిత వ్యవసాయం ద్వారా నిరుపేద రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రమణ గోగుల కృషి చేస్తున్నారు. గతంలో వెంచర్ క్యాపిటలిస్టుగా పనిచేసిన ఆయన.. అనేక అంకుర పరిశ్రమల్లో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సోలార్, ఎల్‌ఈడీ కాంతులు పంచే కృషిలో పాలుపంచుకున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీ, లూసియానా వర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. పలు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్నారు. మన దేశంలో సైబేస్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన ఆయన 25 దక్షిణాది చిత్రాలకు సినీ నేపథ్య సంగీతాన్ని సమకూర్చడం విశేషం. ఆయన రూపొందించిన ఆయే లైలా ఆల్బమ్ ఎంటీవీ, వీ వంటి వినోద, మ్యూజిక్ చానళ్లలో బహుళ ప్రాచుర్యం పొందడం గమనార్హం.
కొండా సంగీతారెడ్డి.. అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
దేశంలో ప్రైవేట్ హెల్త్ కేర్ మార్గదర్శకురాలిగా.. ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ రంగంలో చేసిన సేవల ద్వారా సంగీతారెడ్డి విశేష గుర్తింపు పొందారు. 1983లో ప్రారంభమైన అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ను.. 140 దేశాల్లో 50 మిలియన్ల వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి తీర్చిదిద్దడంలో ఆమె విశేషంగా కృషి చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి.. అత్యుత్తమ స్థాయి వైద్య సేవలందించేలా ఆస్పత్రులను తీర్చిదిద్దారు. వైద్యవిద్యకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పలు సెమినార్లలో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రసూతి బోటిక్‌లు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, మధుమేహ నియంత్రణ కేంద్రాలు, వృద్ధుల సంరక్షణ.. ఇలా వైద్యరంగంలో పలు అంశాల్లో ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012–17)లో ప్రజారోగ్యంపై ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలోనూ సభ్యురాలిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మక టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డులో సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఆస్ట్రేలియాలోని మ్యాక్‌క్వారి వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.
శశిశేఖర్ వెంపటి.. ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
టెక్నోక్రాట్.. ఆవిష్కర్త.. కామెంటేటర్.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనదైన ముద్ర వేసుకున్నారు శశిశేఖర్ వెంపటి. ప్రసారభారతికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమితులైన నాన్ బ్యూరోక్రాట్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు ప్రపంచంలో అతిపెద్ద బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేస్తున్న ప్రసారభారతికి సీఈవోగా చిన్న వయసులోనే ఎంపికై రికార్డు సృష్టించారు. రాజ్యసభ, పార్లమెంట్ టీవీ చానళ్లకు సైతం సీఈవోగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన ‘ఇండియా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్’అన్న అంశంపై విధాన పత్రం రూపొందించారు. ఐఐటీ ముంబైలో విద్యనభ్యసించిన ఆయన రెండు దశాబ్దాల పాటు టెక్నోక్రాట్‌గా సేవలందించారు. సాఫ్ట్‌వేర్ డిజైన్, రియల్‌టైమ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్, సెన్సార్ నెట్‌వర్క్ వంటి అంశాల్లో పనిచేశారు. ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేసినప్పుడు.. ఆయన నాలుగుసార్లు ఆ సంస్థ వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. 2014లో డేటాక్వెస్ట్, పాత్‌బ్రేకర్ అవార్డులను దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో మోదీ డిజిటల్ క్యాంపెయిన్‌కు విశేషంగా సేవలందించారు.
టెస్సీ థామస్.. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డైరెక్టర్
రక్షణ రంగంలో శాస్త్రవేత్త అయిన టెస్సీ థామస్.. ప్రస్తుతం డీఆర్‌డీవోలో అధునాతన వ్యవస్థల ప్రయోగశాల డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రాజెక్ట్ అండ్ టెక్నాలజీ లీడర్‌గా, మిషన్ డిజైన్ అండ్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ అంశాల్లో కీలకంగా కృషి చేసి.. అనేక మంది యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శనం చేశారు. డీఆర్‌డీవోలో సమీకృత అభ్యాస వాతావరణం ఏర్పరచడంలో, యువ శాస్త్రవేత్తలకు భరోసా కల్పించడం, వారి మేధస్సుకు పదును పెట్టడంలో, నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడంలో కీలకపాత్ర పోషించారు. ఐఎన్‌ఏఈ, ఐఈఐ, టీఏఎస్, ఐఈఈఈ, ఏఎస్‌ఐ, ఏఈఎస్ తదితర ప్రతిష్టాత్మక సాంకేతిక విభాగాల్లో సభ్యురాలిగానూ ఉన్నారు. పలు విశ్వవిద్యాలయాల నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డులు పొందారు. 2008లో డీఆర్‌డీవో సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్, 2011–12లో డీఆర్‌డీవో పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్, 2009తో ఇండియాటుడే విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2012లో లాల్‌బహదూర్‌శాస్త్రి అవార్డు, 2016లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులు సాధించారు.
అనురాధ ఆచార్య.. మ్యాప్‌మీ జోం ఇండియా లిమిటెడ్ సీఈవో
జన్యు పరిశోధన నిచేసే జీనోమిక్స్ కంపెనీకి సీఈవోగా ఉన్న అనురాధ ఆచార్య.. తన కంపెనీ ఉత్పత్తులను సుమారు కోట్లాది మందికి చేరువచేయడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. వ్యక్తిగత జన్యుశాస్త్రం ద్వారా మెరుగైన ఆరోగ్య సంరక్షణ ఎలా సాధించవచ్చన్న విధానాన్ని ఆమె 2013లో దేశంలో పరిచయం చేశారు. రెడ్ హెరింగ్ టాప్–100 ఆసియా మరియు గ్లోబల్–2016, ఈఎన్–ఏబీఎల్‌ఈ స్టార్టప్ అవార్డు–2016, వాల్ స్ట్రీట్ జర్నల్ స్టార్టప్ షోకేస్–2016 ఫైనలిస్ట్, ఈటీ స్టార్టప్ అవార్డ్స్– 2015 తదితర అవార్డులు పొందారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం–2011 సదస్సులో ఆమెను యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుతో సత్కరించారు. ప్రస్తుతం ఆమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ జీనోమిక్స్, ఐఐఐటీ హైదరాబాద్ పాలకవర్గ సభ్యురాలిగా, బయోటెక్నాలజీ రంగంలో సీఐఐ ఏర్పాటుచేసిన జాతీయ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment