నేను కూడా బాహుబలినే: వీహెచ్
హైదరాబాద్: ఎవరు ప్రజలను ఆకర్షిస్తారో వాళ్లే బాహుబలి అని కాంగ్రెస్‌లో చాలా మంది బాహుబలులు ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు వ్యాఖ్యానించారు. నేను కూడా బాహుబలినే అని తెలిపారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. 20 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల కంటే.. కేటీఆర్ ఎక్కువ ధీమాగా మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ మాటలు వేరని.. క్షేత్ర స్థాయిలో జనం సమస్యలు వేరుగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
తాగే నీటిలో డ్రైనేజి వాటర్ కలిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. టీఆర్‌ఎస్ సర్కార్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, అసెంబ్లీ సమావేశాల అనంతరం అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించాలని సూచించారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడికి లేఖ రాస్తానని విహేచ్ తెలిపారు. మోదీ ఉత్తరప్రదేశ్‌కి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులు కేంద్రానికి కనబడటం లేదా అని ప్రశ్నించారు. యూపీలో మాత్రమే రుణమాఫీ చేస్తే పోరాటం తప్పదన్నారు.